యువకుడికి పాంక్రియాస్ నిండా రాళ్లు!
1 min read
* ఆరు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పి
* మందులు వాడినా కనిపించని ఫలితం
* కిమ్స్ సవీరాలో సంక్లిష్టమైన శస్త్రచికిత్స
* మొత్తం రాళ్లు తీసేసిన వైద్య నిపుణులు
అనంతపురం, న్యూస్ నేడు: హిందూపురం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి ఆరు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వేరేచోట చూపిస్తే అతనికి క్రానిక్ కాల్సిఫిక్ పాంక్రియాటైటిస్ (పాంక్రియాస్ నిండా రాళ్లు చేరడం) సమస్య ఉందని తెలిసింది. మందులు వాడినా ఉపశమనం లేకపోవడంతో కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడ అతడిని పరీక్షించిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. మహమ్మద్ షాహిద్ అతడికి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి, మొత్తం రాళ్లన్నింటినీ తొలగించారు. ఈ యువకుడికి వచ్చిన సమస్య, దాని లక్షణాలు, కారణాలు, తీవ్రత తదితర వివరాలను డాక్టర్ ఎన్. మహమ్మద్ షాహిద్ తెలిపారు.
తిన్న పదార్థం… అరగదు…!
“సాధారణంగా ఇవి 30-40 ఏళ్ల మధ్య పురుషులకు వస్తుంటాయి. 50% పేషెంట్లలో కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్నవారిలో 25-80% మందికి టైప్ 3సి మధుమేహం వస్తుంది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయి నియంత్రణ కాదు. తిన్నవి అరిగించే ఎంజైమ్‌లు ఉత్పత్తి కావు. పాంక్రియాస్లో రాళ్లు ఏర్పడడం అనేది దీర్ఘకాల సమస్య. ఇవి పాంక్రియాటిక్ కణజాలంలోనే ఏర్పడతాయి. ఈ రాళ్లు పాంక్రియాటిక్ డక్టులకు అడ్డుపడడంతో తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. అలాగే తిన్నవి ఏవీ సరిగా అరగవు. సమయం గడిచేకొద్దీ సమస్య తీవ్రమై, పాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. మనం తిన్న ఆహారం అరగడానికి అవసరమైన ఎంజైములు, కొన్ని హార్మోన్లను, ఇన్సులిన్‌ను పాంక్రియాస్ విడుదల చేస్తుంది. పాంక్రియాస్ అనేది జీర్ణక్రియతో పాటు శరీరంలో చక్కెరశాతం నియంత్రణలోనూ చాలా కీలకమైనది. అందులో రాళ్లు ఏర్పడితే అది సరిగా పనిచేయదు. దానివల్ల పోషకాహార లోపం వస్తుంది. ఇది కేవలం శారీరకంగానే కాక మానసికంగా కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది.
కారణాలు:
- అధికంగా మద్యం వాడకం, 2. క్యాన్సర్, రాళ్లు, ప్రమాదాలు 3. జన్యుపరమైన కారణాలు, 4. కీమోథెరపీ చేయించుకోవడం, 5 లూపస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లు, 6. రక్తంలో కాల్షియం ఎక్కువగా ఉండడం, 7. రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉండడం, 8. జన్యుపరంగా
లక్షణాలు ఇవీ..
పాంక్రియాస్లో రాళ్లు ఏర్పడినప్పుడు పలురకాల లక్షణాలు రావచ్చు. ఇవి పాంక్రియాస్ ప్రధాన విధులు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. దానివల్ల మలంలో కొవ్వు ఎక్కువగా ఉండడం, బరువు తగ్గిపోవడం లాంటివి ఉంటాయి. పాంక్రియాస్ 90 శాతానికి పైగా పాడైపోతే.. అది అస్సలు పనిచేయదు. రాళ్లు ఏర్పడినవాళ్లలో 85% మంది కి ఇలాగే ఉంటుంది. మరోవైపు ఇది ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడంతో టైప్ 3సి మధుమేహం వస్తుంది.
చికిత్స… ఇలా..
ప్రధానంగా జీవనశైలి అలవాట్లు మార్చుకోవడం, కొన్నిసందర్భాల్లో నొప్పి నివారణ మందులు, పాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంట్లు, ఇన్సులిన్ థెరపీ ఇవ్వడం, ఎండోస్కొపిక్ పద్ధతి ద్వారా రాళ్లు తీయడం, స్టెంట్ వేయడం, ఇవేవీ కుదరకపోతే చివరకు శస్త్రచికిత్స చేయడం. రాళ్లు పెద్దసంఖ్యలో ఉన్నప్పుడు ఇలా శస్త్రచికిత్స చేయాలి. ఈ శస్త్రచికిత్స కూడా చాలా సంక్లిష్టమైనది. ఈ కేసులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవడంతో శస్త్రచికిత్స చేసిన ఏడో రోజున రోగిని డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ మహ్మద్ షాహిద్ వివరించారు.
