అన్న క్యాంటీన్ల నిర్వహణ ‘అద్భుతం’
1 min read
93.18% శాతం లబ్దిదారులు సంతృప్తి
7.20 లక్షల మంది ఆకలి తీర్చిన 5 అన్న క్యాంటీన్లు
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు వెల్లడి
కర్నూలు, న్యూస్ నేడు: శనివారంనగరంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ అద్భుతంగా ఉందని, దానికి ప్రజల ఫీడ్‌బ్యాక్‌కే నిదర్శనమని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. శనివారం ఆయన పాత బస్టాండ్, కలెక్టరేట్, ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీలు చేశారు. టిఫిన్ చేస్తున్న లబ్దిదారులను ఆత్మీయంగా పలకరించి, ఆహర రుచి, శుభ్రత, నిర్వహణలపై ఆరా తీశారు. అక్కడే ఉన్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్న క్యాంటీన్ల నిర్వాహకులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. మెనూలో ఉన్న ఆహార పదార్దాలను, స్వచ్చమైన తాగునీరును ప్రజలకు తప్పనిసరిగా అందించాలని, ఆవరణలో శుభ్రత, డస్ట్బిన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే నగరపాలక అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. అనంతరం మెనూ, భోజనం వడ్డింపు, టోకెన్ల జారీ విధానాన్ని కమిషనర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలు బయటకు వచ్చినప్పుడు భోజనం కోసం వందల రూపాయలు ఖర్చు చేయలేక పస్తులు ఉంటారని, వారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కే భోజనం అందించే అన్న క్యాంటీన్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అర్హతలేమి లేకుండా కేవలం రూ.5 లు ఉంటే చాలు, పెద్ద హోటల్లో అందించేంత మెనూతో, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మూడు పూటలా ప్రజలు భోజనం చేయవచ్చన్నారు. నగరంలో అన్న క్యాంటీన్లు అద్భుతంగా, సంతృప్తికరంగా ఉన్నాయంటూ, భోజనం చేసిన లబ్దిదారుల్లో 93.18 శాతం తమ ఫీడ్‌బ్యాక్‌లో తెలిపారని వెల్లడించారు. నగరంలో ఐదు మాసాల క్రితం 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించగా, ఇప్పటికీ 7,20,652 మంది భోజనం చేశారని కమిషనర్ పేర్కొన్నారు.
