అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్ధిక సహాయం
1 min read
ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు ,ఎస్టీలకు రూ.75 వేలు, పివిటిజి లకు లక్ష రూపాయలు
ఏప్రిల్ 2025 లోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి అదనపు ఆర్ధిక లబ్ధి
జిల్లాలో 49,436 వేల మందికి చేకూరనున్న లబ్ధి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పరచాలనే ధృఢ నిశ్చయంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఇందులో భాగంగా పీఎంఏవై 1.0 లో ఇల్లు మంజూరై. ఇంకనూ వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు జివో నెం.9 తేది 10.03.2025 విడుదల చేయడమైనదన్నారు. జిల్లాలో దాదాపు 49,436 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బి.సి. లు 27,150, ఎస్సీలు 18,452, ఎస్టీలు 3,293, పివిటిజిలు(ఆదివాసి గిరిజనులు) 541 మంది, లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గృహనిర్మాణం పూర్తికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలు, బీసీలు అందరికీ రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పివిటిజి(ఆదివాసి గిరిజనులకు) లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని తెలిపారు. అయితే వీటి నిర్మాణాలను ఏప్రిల్ 2025 లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తి చేసుకొనే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారన్నారు. ఈ మేరకు లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. అలాగే గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమెనిటిస్, ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు ఈ విషయాన్ని విసృతంగా ప్రచారం చేసి లబ్దిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్యయంతో కృషి చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడంలో నిధుల మంజూరు కొరకు మధ్యవర్తులు, ఇతరుల మోసపూరిత మాటలు నమ్మరాదని, ఏమైన సమస్యలు ఉన్న యెడల సంబంధిత మండల గృహ నిర్మాణ కార్యాలయం, ఎంపిడివో, మున్సిపల్ కమీషనర్లను సంప్రధించాలన్నారు. కావున లబ్దిదారులు అందరు ప్రభుత్వం అందిస్తున్న ఈ అదనపు ఆర్ధిక లబ్ది సదవకాశాన్ని వినియోగించుకొని తమ సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.