భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు
1 min read
ప్రాంతీయ పట్టణ ప్రణాళిక జోనల్ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్
నూతన మార్గదర్శకాలపై సిబ్బందికి అవగాహన సదస్సు
హాజరైన ఉమ్మడి జిల్లా పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారంరాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, ధరకాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ బి.విజయ భాస్కర్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీల పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, లైసెన్స్ ఇంజనీర్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం కొత్తగా పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని, తద్వారా దరఖాస్తు పోర్టల్లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం పొందవచ్చన్నారు. 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో గ్రౌండుతో పాటు మరో నాలుగు అంతస్తుల భవన నిర్మాణాలకు వాటి యజమానుల స్వీయ ధ్రువీకరణతో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల నుంచి ఆన్లైన్లో అనుమతులు తీసుకొవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం సమీపంలోని లైసెన్డ్స్ టెక్నికల్ పర్సన్ ద్వారా దరఖాస్తులు, అనుబంధ పత్రాలతోపాటు వాటిని ధ్రువీకరిస్తున్నట్లుగా అంగీకార పత్రాన్ని ఆన్లైన్ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, అర్జీతోపాటు అనుబంధ పత్రాలను పోర్టల్ ద్వారా పరిశీలించి అనుమతులిచ్చేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రభుత్వం రూపొందించినట్లు వెల్లడించారు. నిర్మాణం పూర్తయ్యాక, మళ్లీ ఆన్లైన్ పోర్టల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చనని తెలిపారు. భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు తీసుకున్నాక పనుల నిర్వహణపై పట్టణ ప్రణాళిక అధికారులు ఇప్పటివరకు చేపట్టిన పోస్ట్ వెరిఫికేషన్ పద్ధతిలో సైతం ప్రభుత్వం చట్టసరవణ చేసిందన్నారు. సర్వే రిపోర్ట్, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ తదితరాలు తప్పనిసరని, దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లు ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైతే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. టెక్నికల్ పర్సన్ల పరంగా తప్పులు చేసినట్లు నిర్ధారణైతే అలాంటి వారి లైసెన్సులు ఐదేళ్ల పాటు రద్దు అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ శ్రీ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ శోభన్ బాబు, జిల్లా డీటీసీపీఓ శశిలత, నంద్యాల అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి, ఆర్డీడీటీపీ టిపిఏ ఓంకార్, కూడా ఈఈ సురేష్ కుమార్, వివిధ మున్సిపాలిటీల టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, వార్డ్ ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యదర్శులు ఎల్.టి.పిలు పాల్గొన్నారు.
