బిడ్డకు తల్లిపాలే శ్రేష్ఠం..
1 min readముర్రుపాలతో…బిడ్డ ఆరోగ్యం సురక్షితం..
- బిడ్డకు పాలిస్తే… తల్లికి మానసిక సంతృప్తి..
- రొమ్ము, గర్భాశయ క్యాన్సర్కు దూరం..
- జీవీఆర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ పీడియాట్రిక్ వైద్యులు డా. భువనేశ్వరి
కర్నూలు, పల్లెవెలుగు:బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు తాపాలని, బిడ్డకు తల్లిపాలే శ్రేష్ఠమని స్పష్టం చేశారు జీవీఆర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ భువనేశ్వరి. బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. తల్లి ప్రవసం అయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై ఎన్ఆర్ పేటలోని జీవీఆర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ, సీనియర్ పీడియాట్రిక్స్ వైద్యులు డా. భువనేశ్వరి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వారు తెలియక…. పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వకుండా.. పాత పద్దతుల్లో ఆముదం నూనె, తేనే, జంతువులపాలు, గ్లూకోజ్ నీరు తాపిస్తున్నారని, దీని వల్ల పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుందన్నారు.
తల్లిపాలు..జీవిత కాలం టీకా…
తల్లి ప్రసవం అయిన వెంటనే ఆమె స్తనాల నుంచి ప్రథమంగా కొలస్ట్రం అనే పసుపురంగు చిక్కటి పాలు వస్తాయి. వీటిని ముర్రుపాలు అంటారు. అవి బిడ్డకు అమృతంతో సమానమైనవి. ఒకరకంగా జీవితకాలం పని చేసే టీకా అని చెప్పవచ్చు. ఇవి పసికందు మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదపడుతాయి. గుండె, చర్మ, సంబంధ వ్యాధులు, ఉబ్బసం, ఆస్తమా, బీపీ, షుగర్ రాకుండా చేస్తాయి.
శారీరక పుష్టి…
ముర్రుపాలతో మొదటగా విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు పచ్చకామెర్లు కలిగించే బైబిరూబిన్ అనే పదార్థం కూడా విసర్జించబడి మొదటి వారం కలిగే పచ్చకామెర్ల తీవ్రత తగ్గుతుంది. ఈ పాలలో విటమిన్ ఏ అధిక మోతాదులో ఉండడం వల్ల శిశువు కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి. ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఆరు నెలలపాటు తల్లిపాలివ్వడం వల్ల శిశువుకు శారీరక పుష్టి మాత్రమే కాక తల్లితో అనుబంధం ఏర్పడుతుంది. వేసవికాలంలో కూడా తల్లిపాలలో శిశువుకు కావలసినంత నీరు, పుష్టి కలిగించే పదార్థాలు ఉంటా యి. అందువల్ల తల్లి శిశువుకు విడిగా నీరు తాగించవలసిన అవసరం లేదు.
రోగ నిరోధక శక్తి.. పెంపు…
శిశువు సంపూర్ణ మానసిక వికాసానికి గాను రెండేండ్ల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలి. శిశువుకు జబ్బు చేసినప్పటికీ తల్లిపాలు తాగించాలి. దాని వల్ల శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లి అనారోగ్యంగా ఉన్నప్పటికీ శిశువుకు తల్లిపాలు తాగించవచ్చు. తల్లిపాలలో ఉన్న ఇమ్యునోగ్లోబ్లిన్ యాంటీబాడీస్ వలే పనిచేసి శిశువుకు రోగాలతో పోరాడే శక్తినిస్తుంది. తల్లిపాలు సులభంగా జీర్ణమై త్వరగా శరీరంలో శోషించబడుతాయి.
శిశువుకు స్పర్శ..వెచ్చదనం..
తల్లి పాలు తాగే సమయంలో తల్లి నుంచి శిశువుకు స్పర్శ ద్వారా వెచ్చదనం లభిస్తుంది. బిడ్డకు చక్కటి శారీరక, మానసిక, సాంఘిక, ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు గట్టి పునాది. తల్లి శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోకి చేరినా కీడు చేయకుండా తల్లిపాలు నిరోధిస్తాయి. తల్లిపాలలో ఉన్న ప్రోటీన్స్, ఫ్యాట్, క్యాల్షియం తొందరగా గ్రహించబడతాయి. శిశువులను విరేచనాలు నిమోనియా నుండి రక్షిస్తాయి. అలర్జీ, చెవిలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి దోహదపడతాయి.
రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కు దూరం…
శిశువుకు పాలివ్వడం వలన తల్లికి మానసిక తృప్తి లభిస్తుంది. శిశువు పట్ల గాఢమైన ప్రేమ ఏర్పడుతుంది. తల్లి పాలు అధికంగా తాగించటం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి అధికమవుతుంది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. త్వరగా గర్భవతి కాకుండా కాపాడి ఒక విధంగా గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. బిడ్డల మధ్య వ్యవధి పాటించగల్గుతారు. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన అదనపు బరువును తల్లిపాలు ఇవ్వడం వల్ల తగ్గిస్తుంది. తల్లికి రక్తహీనత, ఎముకల బలహీనత నుం డి రక్షణ కలిగిస్తుంది. కనుక తల్లిపాలు తల్లీబిడ్డలిద్దరికీ ఆరోగ్యాన్ని అందించే అమృతం లాంటిదని జి.వి.ఆర్. హాస్పిటల్ అధినేత, ప్రముఖ సీనియర్ పీడియాట్రిక్ వైద్యులు డా. భువనేశ్వరి పేర్కొన్నారు.