1న కర్నూలులో దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సు
1 min read– ‘సైకో సొమాటిక్ డిపార్డర్స్ ’పై పలు రాష్ట్రాల వైద్యులతో చర్చ
- కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డా. బి. రమేష్ బాబు, ఉపాధ్యక్షుడు డా. కె.నాగిరెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు:దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సును ఈ ఏడాది జూన్ 1న కర్నూలులో నిర్వహించనున్నట్లు కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డా. బి. రమేష్ బాబు, ఉపాధ్యక్షులు డాక్టర్ కె. నాగిరెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి 300 మంది మానసిక వైద్యులు హాజరవుతారని వారు పేర్కొన్నారు. గురువారం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డా. బి. రమేష్ బాబు, ఉపాధ్యక్షులు డాక్టర్ కె. నాగిరెడ్డి మాట్లాడారు. సదస్సులో సైకో సొమాటిక్ డిపార్డర్స్ ( శారీరక మానిసక రుగ్మతలు) పై చర్చిస్తామన్నారు. అంతేకాక దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి వల్ల శరీరంలోని హార్మోన్ పై , నాడీ వ్యవస్థ పై మరియు రోగ నిరోధక శక్తిపైన చెడు ప్రభావం చూపుతుందని, దాని వలన బీపీ, షుగర్, ఆస్తమా , తలనొప్పి , పలురకాల చర్మ వ్యాధులు, కడుపులో అల్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉందన్నారు. సైకో సొమాటిక్ వ్యాధులను ఎలా గుర్తించాలనే అంశంపై వివిధ రకాల వైద్య నిపుణులతో చర్చించి.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్యం అందించే విధానంపై ప్రధానంగా చర్చిస్తామన్నారు. జూన్ 1 మరియు 2వ తేదీలలో నిర్వహించే దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సుకు ఎంపీ డా. సంజీవ్ కుమార్, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. రాధిక రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు డా. రమేష్ బాబు, డా. నాగిరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో సైకియాట్రిక్ వైద్యులు డా. హరి ప్రసాద్, డా. సుహృత్ రెడ్డి, డా. శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.