స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం.. భయపెట్టి గెలిచారన్న ప్రతిపక్షం
1 min readపల్లెవెలుగు వెబ్ : ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయత్ అధ్యక్షుల ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు ఘనవిజయం సాధించారు. మొత్తం 75 స్థానాలకు పోలింగ్ జరగగా.. 67 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ విలేకరులకు తెలిపారు. పార్టీ రహిత ఎన్నికలైన.. అభ్యర్థులకు ఏదో ఒక పార్టీ మద్దతు ఉంటుంది. ఆ లెక్కన బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలిచిందని బీజేపీ ప్రకటించింది. 22 చోట్ల చైర్ పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ ఏక్రగ్రీవాల్లో 21 చోట్ల బీజేపీ అభ్యర్థులే ఉన్నారు.
భయపెట్టి గెలిచారు : అఖిలేష్ యాదవ్
అధికార పార్టీ భయపెట్టి, ఓటర్లను అపహరించుకుపోయి బీజేపీ ఈ విజయాలు సాధించిందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఎన్నికలను ప్రజాస్వామ్య నిబంధనలను బీజేపీ అవహేళన చేసిందన్నారు. పంచాయత్ సభ్యులుగా నెగ్గిన వారు ఎక్కువ మంది సమాజ్ వాదీ పార్టీ వారేనని, అలాంటప్పుడు బీజేపీ అభ్యర్థులు చైర్ పర్సన్లు ఎలా నెగ్గుతారని ప్రశ్నించారు.