వ్యవసాయ, అనుబందరంగాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాలి
1 min read
ఏటా మూడు పంటలు పండించేలా రైతులను సమాయత్తం చేయాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రీ సెల్వి
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంను మరింత విస్తీర్ణంలో సాగు చేయాలి
సాగులో డ్రోన్లు వినియోగం, యాంత్రీకరణ పెరగాలి
తాను పండించిన పంటకు ధరను నిర్ణయించుకుని మార్కెట్ ని శాసించే స్థాయికి రైతు ఎదగాలి
రైతు ప్రతీ అవసరాన్ని తెలుసుకుని తీర్చేందుకు వ్యవసాయాధికారులు సిద్ధంగా ఉండాలి
రైతుల అభివృద్దే ధ్యేయంగా వ్యవసాయాధికారులందరూ పనిచేయాలి
వ్యవసాయ వ్యర్ధాలతో ప్రతీ నియోజకవర్గంలోనూ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు
రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతీ శుక్రవారం’ఫోన్ ఇన్ ‘ కార్యక్రమం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కనీస మద్దతు ధర కోరుకునే స్థాయి నుండి తాను పండించిన పంటకు ధరను డిమాండ్ చేసే స్థాయికి జిల్లాలోని ప్రతీ రైతును తీసుకువెళ్లేలా వ్యవసాయాధికారులందరూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక గోదావరి సమావేశపు హాలులో జిల్లాలో వ్యవసాయ, అనుబందరంగాలలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయాధికారులు, రైతులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఆహారాన్ని అందించే రైతే రాజ ని, అటువంటి రైతుని ఒక పారిశ్రామివేత్తగా తీర్చిదిద్ది తాను పండించిన పంటకు ధరను డిమాండ్ చేసి, మార్కెట్ ను శాసించే స్థాయికి ప్రతీ రైతును తీసుకువెళ్లే ధ్యేయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు. జిల్లాలో భూసారం అన్ని రకాల పంటలకు ఎంతో అనుకూలమైనది, ఈ భూములలో నాణ్యమైన ఉత్పత్తులు పండుతాయన్నారు. ఏడాదికి మూడు పంటలు వేసేవిధంగా, సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత ను పెంచేలా రైతులను సమాయత్తం చేస్తామన్నారు. సాగులో డ్రోన్లతో పాటు యాంత్రీకరణ ను ప్రోత్సహించడం, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన, రైతులు తాము పండించిన పంటలకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు, రైతులకు ప్రభుత్వం అందించే ఆర్ధిక చేయూత, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, వ్యవసాయ వ్యర్ధాలతో బయో గ్యాస్ యూనిట్ల ఏర్పాటు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలను ప్రతీ రైతుకు తెలియజేసేందుకు గ్రామ, మండల స్థాయిలలోని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రైతులు సాగుచేసే పంటల వివరాలు, పంటలకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు, రైతులకు కావలసిన కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, యాంత్రీకరణ, తదితర సౌకర్యాలు తెలుసుకుని వాటికి ఆయా రైతులకు అందించేలా రైతులు చర్యలు తీసుకోవాలన్నారు. రసాయనిక ఎరువులతో భూసారం పాడైపోతుందని, సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెంపొందుతుందన్నారు. వ్యవసాయ వ్యర్ధాలతో ప్రతీ నియోజకవర్గంలోనూ బయో గ్యాస్ యూనిట్లు ఏర్పాటుచేయాలన్నారు. ఏలూరు జిల్లాలో ప్రతీ రైతును రాజు చేసే బృహత్తర బాధ్యత వ్యవసాయాధికారులపై ఉందన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు కార్యక్రమం, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులతో ప్రతీ శుక్రవారం ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషాను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, మార్కెఫెడ్, ఏపి సీడ్స్, ఏ పి ఆగ్రోస్ జిల్లా మేనేజర్లు గుప్త,అనిత, హరీష్ రాజ్, వ్యవసాయ శాఖ శాస్త్రజ్ఞులు, అసిస్టెంట్ డైరెక్టలు, మండల వ్యవయసాయాధికారులు, రైతులు, ప్రభృతులు పాల్గొన్నారు.