కరుణాకరరెడ్డిపై కరుణ చూపవద్దు..
1 min read
అసత్యాలతో మత విద్వేషాలు సృష్టిస్తున్నారు
కేసు నమోదు చేసి విచారణ చేపట్టండి
ప్రభుత్వానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల విజ్ఞప్తి
డోన్, న్యూస్ నేడు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై వైసిపి నాయకుడు, నాస్తికుడైన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ మత విశ్వాసాలపై విషం చిమ్ముతూ అసత్యాలను ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్న ఆయనపై ఎలాంటి కరుణ చూపకుండా తక్షణం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ‘అదో నల్లరాయి.. దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ’ గతంలో వెంకటేశ్వరస్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కోటిమంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టిటిడి గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తమని ఆయన అన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, ఈత సమయంలోనే కాకుండా పలు వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని ఆయన అన్నారు. టిటిడి గోశాలలకు చెందిన గత అయిదేళ్ల గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కోట్ల అన్నారు. తాజాగా గడిచిన మూడు నెలల్లో 40 ఆవులు మృత్యువాత పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. కరుణాకర రెడ్డి చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదని ఎక్కడివో అనే విషయం ఆయనకు తెలుసని వాటిని అడ్డుపెట్టుకుని టీటీడీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోట్ల అన్నారు. గోసంరక్షణ శాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు గోవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్షించడం జరుగుతుందన్నారు. గోరక్షణ కోసం 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ కంటికి రెప్పలా కాపాడుతుంటారని కోట్ల వివరించారు. గోశాలలోని 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజూ పర్యవేక్షించడం జరుగుతుంటే ఆవులకు జియోట్యాగ్ తీసేశారంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. గోశాలను గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతిరోజూ శుభ్రపరచడం, బ్లీచింగ్ చేస్తారన్నారు. గోశాలను సందర్శించిన భక్తులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇక్కడ పరిశుభ్రత లేదంటూ తప్పుడు ప్రచారం, చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం చేయడం లేదంటూ అర్థరహిత విమర్శలు చేస్తున్నారన్నారు. జనన, మరణాల రిజిష్టరును గోసంరక్షణ శాలలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసికూడా దురుద్దేశపూర్వకంగా రిజిస్టరులో నమోదు చేయడం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. లేగదూడలను పసిబిడ్డలుగా భావిస్తూ గోశాల సిబ్బంది సేవలందిస్తున్నారన్న విషయం తెలిసీ నాస్తికుడిగా తనను తాను చెప్పుకున్న కరుణాకర రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. నాస్తికత్వంతో ఆయన టిటిడి చైర్మన్‌గా పని చేసిన సమయంలో అవినీతి, అక్రమాలతో టీటీడీ ఖజానాను దారిమళ్ళించి కమిషన్లు కొట్టేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన టిటిడిపై దుష్పచారం చేయడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. తిరుపతి కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది, ఏడుకొండలను 5 కొడలుగా మార్చి కుట్ర చేసింది, టీటీడీని కూడా ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చే చర్యలకు పాల్పడిరది అంటూ ప్రశ్నించారు. టిటిడిపై అవాకులు పేలుతున్న కరుణాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు.