విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు..
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆదేశించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా ఓల్డ్ సిటీలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని, షార్ట్ సర్యూట్ జరగకుండా చూడాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంబాలను మార్చాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ కోతలు ఉండటం వల్ల పేషెంట్ల ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతుందన్నారు. ఆసుపత్రిలో విద్యుత్ నిర్వహణ సరిగ్గా లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆసుపత్రి అధికారులతో చర్చించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్క్ వర్క్స్ వద్ద 33 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటుచేసేందుకు 10 సెంట్ల స్థలం అవసరం అవుతుందని.. ఇందుకోసం మున్సిపల్ అధికారులతో మాట్లాడతామన్నారు. అవసరమైతే విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి ఏర్పాటుచేసేందుకు ముందుకు వెళతామని మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్.ఈ ఉమాపతి, అధికారులు పాల్గొన్నారు.