NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది

1 min read

పాఠశాల స్థాయి నుండి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి

విద్యాభివృద్ధికి,ప్రభుత్వ  పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యంత ప్రాధాన్యత

ప్రతీ విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగినప్పుడే విద్యార్థులు జీవితంలో ముందుకెళ్తారు

ఎంపీ పుట్టా మహేష్ కుమార్

జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలలకు 2 కోట్ల విలువైన ప్రయోగ పరికరాలు అందించిన ఎంపీ

 ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :  నేటి విద్యార్థినీ, విద్యార్థులను రేపటి భావి భారత  శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు.  జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పి.. ధాత్రిరెడ్డి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లతో కలిసి  స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ విద్యా ద్వారానే అభివృద్ధి సాధ్యమని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందన్నారు.  శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం అభివృద్ధి పధంలో పయనిస్తున్నదన్నారు.  పాఠశాలల స్థాయి నుండి విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలని, ప్రతీ విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకతను విద్యార్థులలో రేకెత్తినప్ప్పుడే వారు జీవితంలో ముందుకు వెళ్తారన్నారు.  విద్యా, వైద్యం రంగాలలో ప్రజలకు ఉత్తమ సేవలందించడం ప్రభుత్వ  ప్రాధాన్యతన్నారు. రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు  ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని, విద్యార్థులకు మంచి చదువుకునే వాతావరణం కల్పించేందుకు  ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.  విద్యా బోధనలో ప్రయోగశాలలో నేర్చుకున్న విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని,  ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రయోగశాలలు పేరుకుమాత్రమే ఉండేవన్నారు. ,  విద్యార్థులకు ఏ రంగంలో అభిరుచి ఉందొ తెలుసుకుని, ఆ రంగంలో వారికి ఉత్తమ విద్యను అందించి విద్యార్థులకు  ఉజ్వల  భవిష్యత్తు అందించే బాధ్యత  ఉపాధ్యాయులపై  ఉందన్నారు.జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నానని, ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్య పరచాలన్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ఇంటర్మీడియట్ లో హెచ్.ఈ.సి., సీఈ.సి.,కోర్స్ లను ప్రవేశపెట్టాలని, అదేవిధంగా క్రీడామైదానాన్ని ఏర్పాటు చేయాలనీ కోరాగా, పరిశీలించి వెంటనే ఏర్పాటుచేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రయోగశాలను ఎంపీ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన షేక్ షాజితా, ఎండి. మొబినా లను దుశ్శాలువాతో ఎంపీ సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు అందరూ కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఇంచార్జ్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లను దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాఠశాల విద్యార్థినులతో సెల్ఫీ దిగి, ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డీఈఓ వెంకట లక్ష్మమ్మ,సర్వశిక్షా అభియాన్ ఏపిసి పద్మకుమార్, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్   భానుప్రతాప్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, స్థానిక కార్పొరేటర్ టి. అరుణకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ కుమార్, పూజారి నిరంజన్, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *