అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి కృషి
1 min read
గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను 6 నెలల్లో పూర్తిచేస్తాం
కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి
అహోబిలం/ నంద్యాల న్యూస్ నేడు: అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయనచే విశేష పూజలను చేయించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అహోబిల శ్రీలక్ష్మి నరసింహ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని అహోబిలంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలో గల ఓర్వకల్ వద్ద గల సోలార్ ప్లాంట్ లో అత్యధిక విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరంగా పనులు చేయడం జరుగు తోందని కేంద్రమంత్రి ప్రహ్లాదు జోషి తెలిపారు. ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న 6 నెలల్లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని త్వరలోనే పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి జోషి హామీ ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం నిత్యం శ్రమించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో సోలార్ ప్లాంట్ లో 1700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనకు ముమ్మారంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
