కర్నూలు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్లో లీనియర్ యాక్సిలరేటర్, సి.టి సిమ్యులేటర్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, మెడికల్ ఆంకాలజీ వార్డులను మంత్రి సత్య కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి టి.జి భరత్ మాట్లాడారు. క్యాన్సర్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూల్ మెడికల్ కాలేజీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పేరొందిన డాక్టర్లు కర్నూల్ మెడికల్ కాలేజీలోనే చదివారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తన శాఖకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎంతో కష్టపడుతున్నారన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిని నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని.. మంత్రి టి.జి భరత్ కోరారు.
