ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా అధికారులు కృషి చేయాలి
1 min read
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తోపాటు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్వో వి. విశ్వేశ్వరరావు, ఎస్ఈ కార్పోరేషన్ ఈడి యం. ముక్కంటి,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, శ్రీనివాసరావు, ఎడి సర్వే ఎండి. అన్సారి లతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి అందిన సమస్యలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పిడిఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార తీరుపై ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి అర్జీదారుడు సంతృప్తిచెందేలా పరిష్కారం ఉండాలన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యతగల ఎండార్స్ మెంట్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలుతీసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కార ధ్యేయంగా అధికారులు పనిచేయాలని ఆమె తెలిపారు.అందిన అర్జీలలో కొన్ని జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెంకు చెందిన గెల్లానాగ వినతిపత్రం అందిస్తూ తాడువాయి పంచాయితీలో ఉన్న 1.38 సెంట్లు భూమిని ఇతరులు ఆక్రమించారని సదరు సమస్య పరిష్కరించి తమకు పట్టాఇప్పించాలని కోరారు. దెందులూరుకు చెందిన బూరుగుపల్లి నాగేశ్వరరావు అర్జీనిస్తూ తను నివసిస్తున్న ఇల్లు ఇవ్వమని తన కుమారుడు బెదిరిస్తున్నాడని వారి నుండి రక్షణ కల్పించాలని కోరారు. ముసునూరు మండలం గోపవరంకు చెందిన కొయ్యూరి తిరుపతమ్మ అర్జీనిస్తూ గోపవరంలోని అసైన్డ్ భూమికి సంబంధించి సర్వేచేయించి ఇప్పించాలని కోరారు. నిడమర్రుకు చెందిన బత్తుల చంద్రమౌళి వినితిపత్రం నిస్తూ తమకు చెందిన 34 సెంట్లు భూమి వేరొకరిపేరుపై మ్యుటేషన్ చేసియున్నారని, సదరు విషయం పరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరారు. భీమడోలుకు చెందిన నందవరపు సత్యవతి అర్జీనిస్తూ పెన్షన్ పొందుతూ తన భర్త మరణించారని ఆస్ధానంలో తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. లింగపాలెం మండలం భోగోలుకు చెందిన నిమ్మగడ్డ శ్రీనివాసరావు అర్జీనిస్తూ తమ భూమిని ఆన్ లైన్లో ఎంట్రీ చేసేందుకు ధరఖాస్తు పెట్టియున్నానని సదరు అంశంపై పరిశీలించి ఆన్ లైన్ చేయించవలసిందిగా కోరారు. జంగారెడ్డిగూడెం కు చెందిన వీరవల్లి శంకరరావు వినితిపత్రం ఇస్తూ శారీరక దివ్యాంగుడైన తనకు మూడు చక్రాల బ్యాటరీ వాహనం కు బదులు స్కూటీ ని మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.