ప్రపంచ ఉద్యమ మార్గదర్శి వి.ఐ లెనిన్ 155వ జయంతి
1 min read
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో వి ఐ లెనిన్ 155వ జయంతి కార్యక్రమం ఆర్ ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన జరిగినది. లెనిన్ చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దేవుని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పిస్తూ జోహార్ విఐ లెనిన్, లెనిన్ ఆశయాలను సాధిస్తాం, వర్ధిల్లాలి మార్క్సిజమ్,వర్ధిల్లాలి లెనినిజం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రకృతి సహజ సిద్ధంగా మనిషి పుట్టుక మరణం సహజమని కానీ కొంతమంది మరణించినప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అటువంటి గొప్ప వ్యక్తి వి ఐ లెనిన్ అని కొనియాడారు. లెనిన్ మరణించి శతాబ్ద కాలం గడిచినప్పటికీ నేటికీ ప్రపంచ దేశాల్లో లెనిన్ 155వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ కోట్లాదిమంది ప్రజలు ఆయన చూపిన మార్గంలో పయస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారని అందుకు లెనిన్ ప్రజల పక్షాన నిలబడి వారి కోసం చేసిన పోరాటాలు ఉద్యమాలే కారణమని తెలిపారు. లెనిన్ రష్యాలో తీసుకువచ్చిన విప్లవం ప్రపంచ కార్మిక వర్గానికి దిక్సూచిలా నిలిచిందని తెలిపారు. ప్రపంచంలో పరిశ్రమలు అభివృద్ధి చెందిన దేశాలలో కార్మిక వర్గ నియంతృత్వాన ప్రభుత్వాలు ఏర్పాటు కావాలంటూ కార్ల్ మార్క్స్ చెప్పిన విధంగా లెనిన్ ఆచరించి చూపించారని తెలిపారు. అసమానతలు లేని దోపిడీ లేని సమ సమాజ నిర్మాణం కోసం లెనిన్ చేసిన కృషి పోరాటాలే మనమంతా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో చేసే ఉద్యమాలలో లెనిన్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని అదే మనమంతా ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కార్మిక వర్గ పునాదులపై శ్రామికులను అధికారం లోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా లెనిన్ కృషి చేశారని కొనియాడారు.1917లో రష్యాలో కార్మికుల సాలగ్నంలో అసమానతలు లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లెనిన్ విశేష కృషిని చేశారని తదనంతరం ప్రపంచంలోనే అనేక దేశాలలో జరుగుతున్న ఉద్యమాలకు అక్టోబర్ సోషలిస్టు విప్లవం నాంది పలికిందని కొనియాడారు. రష్యాలో కార్మిక వర్గాన్ని సంఘటతపరిచి ప్రశ్నించే తత్వాన్ని వారిలో మేల్కొలిపి అధికారం దిశగా వారిని నడిపించడంలో లెనిన్ గణనీయమైన పాత్ర వహించాలని వారికి ఒక బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు కొరకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి లెనిన్ అని కొనియాడారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వి.ఐ లెనిన్ చేసిన పోరాటం అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చిందని అందులో భాగంగానే 1925 డిసెంబర్ 26న భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేయబడిందని గుర్తు చేశారు. ఆనాటి నుండి భారతదేశ స్వతంత్ర ఉద్యమం కోసం అనేక పోరాటాలను భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించి స్వతంత్ర అనంతరం బ్యాంకుల జాతీయకరణ చేయాలని,రాజాభరణాల రద్దు,దున్నేవాడికి భూమి కావాలని ,భూ సంస్కరణలు అమలు కొరకు పోరాడి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టడంలో కమ్యూనిస్టు పార్టీ ఎనలేని కృషి చేసిందని తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు పోరాటాలకు లెనిన్ చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తద్వారా ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ భారతదేశ లౌకిక వాదాన్ని రాజ్యాంగాన్ని రక్షించడం కొరకు చేసే ఉద్యమాలను జయప్రదం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, కొల్లూరి సుధారాణి,ఏలూరు జిల్లా సమితి సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, గొర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మి, భవాని, ఏఐటీయూసీ ఏలూరు నగర కార్యదర్శి అప్పలరాజు, మెకానికల్ యూనియన్ నాయకులు కాటూరి శ్రీధర్,బేతా శంకర్ ఎర్ర వెంకటేశ్వరరావు కనకం జగన్మోహనరావు, మూర్తి, ఏఐటీయూసీ సభ్యులు పళ్ళెం కిషోర్, జగన్నాధ రావు తదితరులు పాల్గొన్నారు.