స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి…
1 min read
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచన
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా మంజూరు చేసే పింఛన్లకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రంలో కొత్తగా 89,788 మందికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం అని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గత ఏడాది నవంబరు నుంచి అమలు చేస్తూ, లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున పింఛన్ పంపిణీ ఎంపీ పేర్కొన్నారు. అయితే 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకూ పింఛన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలిచ్చిందని ఎంపీ తెలిపారు. అర్హురాలైన మహిళలు భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు వివరాలను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలని ఎంపీ సూచించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 30 లోపు వివరాలతో కూడిన దరఖాస్తు సమర్పిస్తే మే 1న పింఛను సొమ్ము పంపిణీ చేస్తారని ఎంపీ తెలిపారు. గడువు లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ 1 నుంచి చెల్లిస్తారని ఎంపీ వెల్లడించారు. పూర్తి వివరాలకు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు.