‘నమస్తే’తో వ్యర్థ పికర్స్‌కు గుర్తింపు…
1 min read
నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజేడ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (నమస్తే) పథకం వ్యర్థాలను ఏరుకునే పికర్స్‌లకు గుర్తింపును ఇచ్చి, ప్రభుత్వాల పథకాల సద్వినియోగానికి ఎంతగానో దోహదపడుతుందని నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ‘నమస్తే’ కార్యక్రమ ప్రత్యేక క్యాంపు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజారోగ్య అధికారి మాట్లాడుతూ.. వ్యర్థాలను సేకరించే వ్యక్తులు (వేస్ట్ పికర్స్), పారిశుద్ధ్య కార్మికులను (సఫాయి కర్మచారి) అధికారికంగా గుర్తించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నమస్తే పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయన్నారు. వ్యర్థాలను సేకరించే వ్యక్తులకు సురక్షితమైన, గౌరవప్రదమైన, స్థిరమైన జీవనోపాధిని అందించడం జరుగుతుందని, ఇందుకోసం గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ చేయించడం వంటివి చేపట్టాల్సి ఉంటుందన్నారు. నమస్తే వెబ్సైట్లో ప్రొఫైల్ పెట్టాక వారికి అధికార గుర్తింపు వస్తుందన్నారు. తద్వారా వారికి భద్రత, భరోసా కల్పించడంతో పాటు వారి సామర్ధ్యాన్ని పెంపొందించడానికి వృత్తి నైపుణ్యం మెరుగుదలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లు, ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం పొందవచ్చని, వ్యర్థాలను సేకరించే వాహనాల కొనుగోలుకు రూ.5 లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు పొందవచ్చన్నారు. కాబట్టి వ్యర్థాలను సేకరించేవారు ప్రభుత్వాల నుండి ప్రయోజనాలు పొందేందుకు నమస్తే పథకంలో నమోదు కావాలని కోరారు. దీని కోసం స్థానిక శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేదా నమస్తే కార్యక్రమం ఆర్‌ఓ 9492469964 నెంబర్‌కు కాల్ చేయవచ్చని ప్రజారోగ్య అధికారి సూచించారు.అనంతరం క్యాంపులో పాల్గొన్న దాదాపు 100 మంది వెస్ట్ పికర్స్ తమ ప్రొఫైల్ నమోదు చేసుకుని, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా కొరకు దరఖాస్తు చేసుకున్నారు. అంతకన్నాముందు పికర్స్‌కు నమస్తే కార్యక్రమంపై నమస్తే కార్యక్రమ (స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్) స్టేట్ కోఆర్డినేటర్ అనిల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ చిట్టిబాబులు అవగాహన కల్పించారు.