విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: మద్దికేర మండలం పెరవలి గ్రామంలో మంగళవారం విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ భూమి పూజ చేశారు. పెరవలితోపాటు ఆరు గ్రామాలకు కరెంట్ సమస్యను తీర్చే మూడు కోట్ల రూపాయలతో నూతన విద్యుత్ 11/33 కే.వి. ఉప కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్, విద్యుత్ జిల్లా అధికారి ఉమాపతి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు రైతు కూలీలకు మంచి చేసే ప్రభుత్వమని అన్నారు. మద్దికేర మండల పరిధిలోని పెరవలి, ఎడవల్లి, బొమ్మనపల్లి, మదనంతపురం , చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులకు లో వోల్టేజ్ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమస్యను పరిష్కరించానని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి మేలు చేయకపోగా రైతులకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. వచ్చే ఆగస్టు లోపు విద్యుత్ ఉపకేంద్రం పనులు పూర్తిచేసి రైతులకు విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెరవలి నాయకులు, కార్యకర్తలు, మద్దికేర మండలం నాయకులు,కార్యకర్తలు,కూటమి నాయకులు,విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
