PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘దీదీ’ పై చైనా ఉక్కుపాదం..1.64 ల‌క్షల కోట్లు న‌ష్టం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : చైనా ప్రభుత్వం.. ఆ దేశ కార్పొరేట్ సంస్థల‌పై ఉక్కుపాదం మోపుతోంది. కార్పొరేట్ సంస్థల‌ను త‌న గుప్పిట్లో పెట్టుకునే ల‌క్ష్యంతో సైబ‌ర్ భ‌ద్రత పేరిట కొత్త నిబంధ‌న‌లు అమలుకు సిద్ధమైంది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతున్న కార్పొరేట్ కంపెనీల‌ను టార్గెట్ చేసుకుంది. లిస్టింగ్ పేరిట చైనా కీల‌క స‌మాచారాన్ని విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని, ఇలా చేస్తే క‌ఠిన‌చ‌ర్యలు త‌ప్పవ‌ని చైనా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఇత‌ర దేశాల‌కు త‌రలించే స‌మాచారం విష‌యంలో నియంత్రణ క‌ఠిన‌త‌రం కానుంది. స్టాక్ మార్కెట్లో జ‌రుగుతున్న మోసాలు, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్, మ్యానిప్యులేష‌న్ అరిక‌ట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చైనా కేబినెట్ తెలిపింది.
దీదీ న‌ష్టం 1.64 ల‌క్షల కోట్లు : గ‌తంలో టెన్సెంట్, అలీబాబా సంస్థల‌ను కూడ నిబంధ‌న‌ల పేరుతో చైనా ప్రభుత్వం క‌ట్టడి చేసింది. చైనా ప్రభుత్వం ఆగ్రహానికి గురైన జాక్ మా.. ఇప్పటి వ‌ర‌కు మీడియా ముందుకు రాక‌పోవ‌డ‌మే.. చైనా నియంత్రణ‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పవ‌చ్చు. ఇప్పుడు సైబ‌ర్ భద్రత పేరుతో .. క్యాబ్ సేవ‌లు అందించే దీదీ సంస్థను టార్గెట్ చేసింది. సైబ‌ర్ భ‌ద్రత స‌మీక్ష నేప‌థ్యంలో కొత్త రిజిస్ట్రేష‌న్లు నిలిపివేయ‌డం, చైనా అప్లికేష‌న్ స్టోర్ల నుంచి దీదీ యాప్ ను తొల‌గించాల‌ని దీదీ గ్లోబ‌ల్ సంస్థకు చైనా ప్రభుత్వం తెలియ‌జేసింది. దీంతో దీదీ షేర్లు ఒక్కసారిగా ప‌డిపోయాయి. 30 శాతం దాక షేర్ వ్యాల్యూ ప‌డింది. దీదీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ లో 1.64 ల‌క్షల కోట్ల రూపాయ‌లు ఆవిరైపోయాయి.

About Author