త్వరలో ఏజెన్సీ ఉద్యోగుల బకాయిలు విడుదల
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది దేవస్థానంలో పనిచేయుచున్న ఏజెన్సీ ఉద్యోగుల వేతన బకాయిలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. గత ఫిబ్రవరి మాసం నుండి మహానంది దేవస్థానంలో దాదాపు 86 మంది ఏజెన్సీ సిబ్బంది పనిచేస్తున్నారు. మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు వేతనాలు అందలేదని ఏజెన్సీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి వేతనాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఆడిట్ అధికారులకు ఒక లేఖ కూడా పంపినట్టు తెలుస్తుంది. మూడు నెలల్లోపు దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల నుండి జీతభత్యాలు చెల్లింపుకు సంబంధించి అవరోధం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆడిట్ అధికారులకు లేఖ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. గతంలో ఏజెన్సీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి 6 నెలలు మాత్రమే జీతాలు చెల్లించే విధంగా టెండర్ వేశారని అటెండర్ ప్రక్రియ ఫిబ్రవరి మాసంతో ముగిసినట్లు తెలుస్తుంది . అప్పటినుండి ఎలాంటి టెండర్ పిలవకపోవడంతో ఏజెన్సీ సిబ్బంది జీతాలు చెల్లింపు ఆగిపోయినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పనిచేసే ఏజెన్సీ సిబ్బందికి ఓకే విధానం, ఒకే రకమైన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్న నేపథ్యంలో వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఆడిట్ అభ్యంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూనే త్వరలో మహానంది దేవస్థానంలో పని చేసే ఏజెన్సీ సిబ్బంది వేతనాలు చెల్లిస్తామని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆ దిశలో అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఏజెన్సీ సిబ్బంది మాత్రం మా అందరి కడుపులు మరిన్ని రోజులు వేతనాలు చెల్లించకుండా కాల్చవద్దని వేడుకుంటున్నారు.