గోడకూలి గాయాల పాలైన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం అందించాలి
1 min read
సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.సత్యన్న
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలోని కోసిగి రోడ్డు నందు ఎల్లమ్మ బీడు దగ్గర మూడు అంతస్తుల భవన నిర్మాణ దశలో కాంట్రాక్టర్ మరియు ప్రైవేటు ఇంజనీర్ జరిపిన నిర్మాణ రాహిత్య లోపాల వలన గాయాల పాలైన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం అందించాలని సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.సత్యన్న డిమాండ్ చేశారు. శనివారం నాడు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ కి ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.సత్యన్న మాట్లాడుతూ నిన్నటి రోజున(16.05.2025) శుక్రవారం రాత్రి 8 సమయంలో నిర్మాణం నందు గల మూడంతస్తుల భవనం నుండి ఒక గోడ కూలి పక్కనే ఉన్న పూరి గుడిసె రేకుల ఇళ్ల పై నేలకొరిగిందని అన్నారు. గుడిసెలే ఉన్న 14 మంది పేద ప్రజలు ఉమ్మడి కుటుంబంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు . మూడంతస్తుల భవనంలోని గోడ నేలకొరగడం వలన కురువ శ్రీరాములు కుటుంబం నందు గల ఇద్దరు పిల్లలు పై తీవ్ర గాయాలై వారి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన ఇద్దరు చిన్నారులు లిఖిత,రుచిత కర్నూలు కేర్ హాస్పిటల్ నందు వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. కురువ శ్రీరాములు కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మిగిలిన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలు వలన ప్రమాదం నుండి బయటపడ్డారని అన్నారు. నిర్మాణ బాధ్యత రహితంగా వ్యవహరించిన ప్రైవేటు ఇంజనీర్ మరియు కాంట్రాక్టర్ పై ఏమ్మిగనూరు మున్సిపాలిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఇంజనీర్ వారి లైసెన్సును రద్దు చేయాలని కోరారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన వారి నుండి క్షతగాత్రులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, నేలకొరిగిన పూరిగుడిసెకు మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా కోలుకునేంతవరకు ప్రవేట్ ఇంజనీర్ మరియు కాంట్రాక్టర్ వారే ఆసుపత్రి ఖర్చులు భరించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా మున్సిపాలిటీ అధికారులు భవన నిర్మాణం చేపడుతున్నటువంటి వారికి పూర్తిగా అవగాహన కల్పించి, నిర్మాణ రహితంగా ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐ. ఎఫ్.టి.యు నాయకులు ఎస్.బాలరాజు,బాబు,పి.వై.ఎల్ నాయకులు ఎస్.మునెప్ప,యూసఫ్,ఏఐకెఎంఎస్ నాయకులు పెద్దారెడ్డి,ఎల్లప్ప,మరియు తదితరులు పాల్గొన్నారు.