అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా అక్షరాంధ్ర
1 min read
ఈ ఏడాది ఆసక్తిగల వయోజనులైన 97,200 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. బుధవారం స్ధానిక కలెక్టర్ బంగ్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఉల్లాస్ – అక్షరాంద్ర జిల్లాస్థాయిఅధికారులతో కన్వర్జేన్స్ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 100 గంటల శిక్షణతో ఈఏడాది 97,200 నిరక్షరాస్యులను అక్షరాశ్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో జిల్లాను ప్రధమ స్ధానంలో ఉంచాలన్నారు. గత ఏడాది నిర్వహించిన ఉల్లాస్ కార్యక్రమం అమల్లో ఏలూరు జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్ధానంలో ఉందన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 2023 వ సంవత్సరంలో నిర్వహించిన క్యాస్ట్ సర్వే ద్వారా జిల్లాలో 15-59 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగిన 3,16,441 మంది నిరక్షరాస్యులను గ్రామ , వార్డు సచివాలయాల శాఖల ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. వారి నుండి ఏలూరు జిల్లాలో మొదటి విడతగా 2025-26 సంవత్సరం లో ఆసక్తిగల 97,200 మంది వయోజనులైన నిరక్షరాస్యులను ఎంపిక చేసి వారందరిని అక్షరాస్యులుగా చేయడానికి సంబంధిత శాఖల ద్వారా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తదుపరి మూడు సంవత్సరాల్లో మొత్తం 3,16,441 మంది నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేసి ఏలూరు జిల్లాని అక్షరాస్యతలో మొదటి స్థానంలోకి తీసుకుని రావాలని సూచించారు.ప్రస్తుతం చేపట్టిన రెండో దఫా అక్షరాంద్ర అక్షరాస్యత కార్యక్రమం ఈనెల 20వ తారీకు వరకు మండలాలలో వాలంటరీ టీచర్స్ ని గుర్తించి, వారికి మ్యాచింగ్ బ్యాచింగ్ ద్వారా పదిమందికి ఒక వాలంటరీ టీచర్ ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఈనెల 21వ తారీకు నుండి 25వ తారీకు వరకు ఒకరోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈనెల 26వ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు మండల స్థాయిలో వాలంటరీ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి శిక్షణ కార్యక్రమాలు ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ఆగస్టు 7వ తేదీ నుండి వచ్చే ఫిబ్రవరి వరకు 100 గంటల తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ శిక్షణ తరగతులలో వయోజనులైన నిరక్షరాస్యులకు ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, ఫంక్షనల్ లిటరసీ లలో శిక్షణ అందించాలన్నారు. అనంతరం మార్చి నెలలో వారికి పరీక్ష నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి కె వి వి సత్యనారాయణ, జెడ్పి సిఇఓ శ్రీహరి, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిఇఓ ఎం. వెంకటలక్ష్మమ్మ, ఐసిడిజిఎస్ ఈఈ మల్లిక, వయోజన విద్య అసిస్టెంట్ ప్రొజెక్టర్ అధికారి విజయకుమార్, జిల్లా పంచాయితీ,మెప్మా అధికారులు పాల్గొన్నారు.
