ఈదర సుబ్బమ్మ దేవి స్కూల్లో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం
1 min read
తల్లిదండ్రులు తమ పిల్లలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పాల్గొన్న మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
డ్రగ్స్ నిరోధక గోడ పత్రికలు ఆవిష్కరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విద్యార్ధుల భవిష్యత్ బంగారుమయం చేసే విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. విద్యార్ధుల తల్లిదండ్రులు తరచూ పాఠశాలలకు వెళ్ళి, తమ పిల్లల విద్య, సామాజిక ప్రవర్తనపై ఉపాధ్యాయులతో చర్చించాలని హితవు పలికారు. చెడుకు ఆకర్షితులు కాకుండా తమ పిల్లలను నిరంతరం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈదర సుబ్బమ్మా దేవి నగర పాలకోన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ లో అత్యుత్తమ మార్కులు సాధించే ఇద్దరు విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేంతవరకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులతో పాటు ప్రజల భాగస్వామ్యం పెంచి మరింత బలోపేతం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా గురువారం ఏలూరు నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఏలూరు రామచంద్రరావుపేటలోని ఈదర సుబ్బమ్మా దేవి నగర పాలకోన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొనగా పాల్గొన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి అతిధులుగా పాల్గొన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ విద్యా వికాసమే లక్ష్యంగా విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఆత్మీయ సమావేశాలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం డ్రగ్స్ నిరోధక గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. చివరిగా విద్యార్ధులు తమ తల్లుల కాళ్ళు కడిగి,ఆశీర్వాదాలు పొందారు.
