ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
1 min readప్రజలను విజ్ఞప్తి చేసిన నగరపాలక కమిషనర్, ఈఆర్ఓ ఎస్.రవీంద్ర బాబు
9,10వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు
ఓటు నమోదు, సవరణలు, తొలగింపునకు అవకాశం
బిఎల్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ సమ్మరీ రివిజన్-2025 కార్యక్రమంలో భాగంగా 9, 10 తేదీ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్, కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.రవీంద్ర బాబు తెలిపారు. శుక్రవారం ఆయన నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, కౌన్సిల్ హాలులో బిఎల్వోలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. 9, 10వ తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, రెండు రోజుల పాటు బిఎల్వోలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు (ఫారం-6), ఓటు తొలగింపు (ఫారం-7), వివరాల మార్పునకు (ఫారం-8) దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అనంతరం కమిషనర్ బిఎల్‌ఓలతో మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బిఎల్వోలు రెండు రోజుల పాటు అందుబాటులో ఉండాలని, ఎటువంటి పొరపాట్లు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిండే ప్రతి ఒక్కరూ అర్హులని, జాబితాలో సవరణలు, ఓటు తొలగింపులకు సంబంధింత దరఖాస్తులు స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు తమ పోలింగ్ వద్దకు వెళ్ళి సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్, ఈఆర్ఓ ఎస్.రవీంద్ర బాబు కోరారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ, తహశీల్దార్ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజుర్ బాష, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.