ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తేనే.. ఎన్నికల్లో పొత్తు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఎంఐఎం పార్టీ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. బలం ఉన్న చోట తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించి .. ఎంఐఎం ఉనికిని చాటే ప్రయత్నం చేస్తోంది. గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేసిన ఎంఐఎం పార్టీ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కు దూరం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం ఓట్లను చీలుస్తూ.. పరోక్షంగా బీజేపీకి మేలు చేకూరుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఎంఐఎం పార్టీ తన మార్కు పాలిటిక్స్ తో కొన్ని సీట్లలో పాగా వేసింది. త్వరలో ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే యూపీలో మాత్రం కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ… సమాజ్ వాదీ పార్టీతో దోస్తీకి సిద్ధమవుతోంది.
ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి :
యూపీలో వచ్చే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉపముఖ్యమంత్రి పదవి తమ పార్టీ ఎమ్మెల్యేకే ఇవ్వాలని ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదిరితేనే ఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని ఎంఐఎం ఆలోచిస్తోంది. లేదంటే 100 సీట్లలో ఎంఐఎం పోటీకి సిద్ధమవుతుందన్న సంకేతాలు ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటించిన అసదుద్దీన్.. కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. బీజేపీ ఓటమి కోసం ఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచనప్రాయంగా సందేశం ఇచ్చారు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ బీఎస్పీ, ఎస్పీ, ఎంఐఎం పార్టీలు తమ తమ వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు.