బలిజలను ‘బీసీ’లో చేర్చాల్సిందే…
1 min read– కాపు సంక్షేమ సేన రాష్ట్ర కన్వీనర్ చందు శ్రీనివాస రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాయలసీమలోని 54 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలలో రాజకీయ నాయకుల గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయిలో బలిజలు ఉన్నారని, కానీ ఇక్కడ బలిజలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర కన్వీనర్ & పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ & రాయలసీమ జిల్లాల ఇంఛార్జ్ చందు శ్రీనివాస రావు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్‌లోని డాక్టర్ బ్రహ్మరెడ్డి కాన్ఫరెన్స్ హాల్ నందు మంగళవారం కాపు సంక్షేమ సేన కర్నూలు జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చందు శ్రీనివాస రావు మాట్లాడుతూ బలిజ విద్యార్థులకు విద్యాపరంగా, యువతకు ఉపాధి కల్పన, జనాభా దామాషా ప్రకారం బలిజ కాపులకు దక్కాల్సిన రిజర్వేషన్ పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పాలకుల నిర్లక్ష్యం వలన ఉన్నత చదువులు కష్టపడి చదువుకుని రిజర్వేషన్ అందక కూలీ నాలీ చేసుకుని బలిజ కాపు యువత బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బలిజలను బీసీలో చేర్చాలి..
బలిజ కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు కాపు సంక్షేమ సేన రాష్ట్ర కన్వీనర్ చందు శ్రీనివాస రావు. రాష్ట్రంలో
వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, కాపు కార్పొరేషన్ కు ఏటా 2000 కోట్ల చొప్పున మూడేళ్లలో 6000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా యువతకు ఋణం ఇవ్వలేదన్నారు. బడుగు బలహీన వర్గాలతో కలిసి బలిజ కాపు తెలగల రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తామని, మాకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని బలిజలకు న్యాయ చేసే వారికే మా మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర సలహా కమిటీ సభ్యులు కోనేటి చంద్ర బాబు, ఉపాధ్యక్షులు చింతలపల్లి రామ కృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బలిజ శ్రీరాములు, జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్, యువసేన కర్నూలు జిల్లా అధ్యక్షులు కొట్టె మల్లికార్జున, సోషల్ మీడియా కన్వీనర్ అరిగేల నగేష్, కర్నూలు జిల్లా బలిజ సంఘం పెద్దలు పత్తి ఓబులయ్య, డాక్టర్ విజయ శంకర్, కాపు సంక్షేమ సేన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గుర్రాల రామాంజినేయులు, జిల్లా కార్యదర్శి గల్లా రామచంద్ర, జిల్లా అసెంబ్లీ నాయకులు పాల్గోన్నారు.