కమ్యూనిటీ హాల్స్‌ను సచివాలయాలుగా మార్చడం దారుణం
1 min read– టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టి.జి భరత్
పల్లెవెలుగు, కర్నూలు
పేద యువతీయువకుల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాల కోసం గత ప్రభుత్వ హయాంలో కట్టించిన కమ్యూనిటీ హాల్స్‌ను సచివాలయాలుగా మార్చడం దారుణమని కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శనివారం నగరంలోని 23, 24, 25, 18 వార్డుల్లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 23వ వార్డు అభ్యర్ధి దానమ్మ, 24వ వార్డు అభ్యర్థి రవణమ్మ, 25వ వార్డు అభ్యర్థి అరుణ కుమారి, 18వ వార్డు అభ్యర్థి మోహన్‌లను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా టి.జి భరత్ మాట్లాడుతూ వార్డుల్లో కమ్యూనిటీ హాల్స్‌ను సచివాలయాలుగా పెట్టడం ఏంటన్నారు. దీనివల్ల ప్రజలు శుభకార్యాలయాలు నిర్వహించుకునేందుకు ఎక్కడకు వెళతారని ప్రశ్నించారు. సచివాలయాల కోసం ప్రత్యేక భవనాలు పెట్టుకోవాల్సింది పోయి కమ్యూనిటీ హాల్స్లనే ఇలా మార్చడం మంచిది కాదన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని తాము గెలిచిన వెంటనే పేద ప్రజల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్స్‌ను యథాస్థితిలో కొనసాగేలా చేస్తామన్నారు. ఇక ఓటరు స్లిప్పులు లేని వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులు అన్న అపోహలు ఉన్నాయని.. ఇందులో నిజం లేదన్నారు. ఓటరు లిస్టులో పేరు ఉన్న వాళ్లు స్లిప్పు లేకపోయినా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకొని ఓటు వెయ్యొచ్చన్నారు. ఈ విషయంలో ప్రజలు గందరగోళానికి గురి కావద్దన్నారు. అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. 18వ వార్డు జొహరాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ పాల్గొన్నారు.