PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13 ఏళ్ల బాలికకు కాలి ఎముక‌లో కేన్స‌ర్

1 min read

* విజ‌య‌వంతంగా చికిత్స చేసిన అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు

* దేశంలో క్ర‌మంగా పెరుగుతున్న పిల్ల‌ల కేన్స‌ర్ కేసులు

* ఎందుకు వ‌స్తుంద‌ని ఆలోచిస్తూ.. చికిత్స‌ను ఆలస్యం చేయొద్దు

* త్వ‌ర‌గా చికిత్స ప్రారంభిస్తే మంచి ఫ‌లితాలు: డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డి

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్ : ఆమె అభం శుభం ఎరుగ‌ని 13 ఏళ్ల బాలిక‌. తోటి పిల్ల‌ల‌తో క‌లిసి చెంగుచెంగున గెంతుతూ ఆడుకోవాల్సిన వ‌య‌సు ఆమెది. అంతా బాగానే ఉంద‌నుకుంటున్న త‌రుణంలో కేన్స‌ర్ సోకింది. అది కూడా కాలి ఎముక‌కు సంబంధించిన ఆస్టియోస‌ర్కోమా అనే ర‌కం కేన్స‌ర్. త‌మ పాప కాలిలో స‌మ‌స్య ఉంద‌ని గుర్తించ‌గానే ఆ త‌ల్లిదండ్రులు వెంట‌నే ఆమెను న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అమోర్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. ఆస్ప‌త్రిలో ఉన్న ఆర్థో ఆంకాల‌జీ నిపుణుడు డాక్ట‌ర్ కిషోర్ బి.రెడ్డి ఆమెను వెంట‌నే ప‌రీక్షించి బ‌యాప్సీ చేయించారు. ఫ‌లితాలు నాలుగైదు రోజుల్లోనే రావ‌డంతో వెంట‌నే చికిత్స మొద‌లుపెట్టారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న తెలిపారు. “న‌గ‌రంలో గ‌చ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ త‌మ కుమార్తె కాలిన‌డ‌క‌లో ఏదో తేడా ఉంద‌ని గుర్తించారు. వెంట‌నే మా ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చారు. బాలిక‌ను ప‌రీక్షించి చూసిన‌ప్పుడు కాలి ఎముక‌కు కేన్స‌ర్ సోకింద‌న్న అనుమానంతో బ‌యాప్సీ చేయించి, ఫ‌లితం రాగానే ఆమెకు ముందుగా మూడు సైకిల్స్ కీమోథెర‌పీ ఇచ్చి, త‌ర్వాత శ‌స్త్రచికిత్స చేశాం. అందులో భాగంగా పాడైన కాలి ఎముక‌ను పూర్తిగా తొల‌గించి, దాని స్థానంలో జ‌ర్మ‌నీ నుంచి తెప్పించిన కృత్రిమ ఎముక‌ను అమ‌ర్చాం. త‌ర్వాత మ‌ళ్లీ కీమోథెర‌పీ సెష‌న్లు మొద‌లుపెట్టాం.సాధార‌ణంగా ఈ త‌ర‌హా కేన్స‌ర్ 20 ఏళ్ల‌లోపువారికే వ‌స్తుంది. దీన్ని స‌రైన స‌మ‌యంలో గుర్తించ‌డం, వెంట‌నే చికిత్స ప్రారంభించ‌డం ముఖ్యం. ఇద్ద‌రు ముగ్గురు వైద్యుల‌ను సంప్ర‌దిద్దాం అనుకోవ‌డం ఒక ర‌కంగా మంచిదే అయినా, దానివ‌ల్ల విలువైన స‌మ‌యం చాలా వృథా అవుతుంది. ఈ కేసుల్లో ఎంత త్వ‌ర‌గా చికిత్స ప్రారంభిస్తే, త‌ర్వాత కోలుకుని సాధార‌ణస్థితికి చేర‌డానికి అంత ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి. పిల్ల‌ల‌కు కాలి ఎముక ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి దాని దృష్ట్యా ప్ర‌త్యేకంగా చికిత్స చేయాలి. సాగే గుణం ఉన్న కృత్రిమ ఎముక‌లు ఉంటాయి గానీ, వాటి ఖ‌రీదు బాగా ఎక్కువ‌. అందుకే కొంత గ్యాప్ ఉంచి సాధార‌ణ కృత్రిమ ఎముక‌ను అమ‌ర్చాం. చికిత్స పూర్త‌య్యాక ఆ పాప ఎంచ‌క్కా న‌డ‌వ‌చ్చు, జాగింగ్ కూడా చేయొచ్చు. అయితే కాలితో ఆడే ఆట‌లు ఆడ‌కూడ‌దని చెప్పాం. మిగిలిన జీవిత‌మంతా సాధార‌ణంగా ఉంటుంది. ఇప్పుడు అమ‌ర్చిన ఎముక దాదాపు 20 ఏళ్లు బాగా ప‌నిచేస్తుంది.పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు కీమోథెర‌పీ ఇచ్చే విష‌యంలో చాలా తేడాలుంటాయి. త‌గినంత డోసు ఇవ్వ‌క‌పోతే స‌రిగా ప‌నిచేయ‌దు, అలాగ‌ని డోసు ఎక్కువైతే దుష్ప్ర‌భావాలు తీవ్రంగా ఉంటాయి. టీనేజ‌ర్ల‌లో అయితే భ‌విష్య‌త్తులో పున‌రుత్ప‌త్తి స‌మ‌స్య‌లు ఉండ‌కుండా వారి వీర్యం, అండాలు ముందే సేక‌రించి భ‌ద్ర‌ప‌రుస్తాం. అలాంటి తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు కాకుండా జుట్టు రాల‌డం, వాంతులు, ఆక‌లి ఉండ‌క‌పోవ‌డం లాంటివి చాలామందిలో వ‌స్తాయి. వాటిని త‌గ్గించ‌గ‌లం కూడా. ఇటీవ‌లి కాలంలో దేశంలో కేన్స‌ర్ కేసులు బాగా ఎక్కువ‌వుతున్నాయి. ముఖ్యంగా కేన్స‌ర్ల‌లో క‌ణితులు, ర‌క్తానికి సంబంధించిన‌వ‌నే రెండు ర‌కాలుంటాయి. ఈమ‌ధ్య ర‌క్తానికి సంబంధించిన‌వి, బోన్‌మ్యారో కేన్స‌ర్లు సైతం పెరుగుతున్నాయి. పిల్ల‌ల విష‌యంలోనైతే పెద్ద‌లు ఎప్పుడూ గ‌మ‌నిస్తూ ఉంటారు కాబ‌ట్టి ఏ చిన్న తేడా వచ్చినా వెంట‌నే త‌గిన వైద్యుల‌కు చూపించ‌డం ముఖ్యం. ఈ కేసులో త‌ల్లిదండ్రులు అస్స‌లు స‌మ‌యం వృథా చేయ‌లేదు. నేరుగా ఆస్ప‌త్రికి వ‌చ్చారు, ప‌రీక్షించాం, ఫ‌లితం రాగానే ఒక్క రోజు కూడా ఆగ‌కుండా చికిత్స మొద‌లుపెట్టాం. అస‌లు మా పిల్ల‌ల‌కు ఎందుకు వ‌స్తుంద‌నే నిరాక‌ర‌ణ ఎక్కువ‌గా ఉంటోంది. అలా కాకుండా, వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ముందు అంగీక‌రించాలి. ఆ త‌ర్వాత చికిత్స చేయించాలి. అప్పుడే మంచి ఫ‌లితాలు ఉంటాయి” అని డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డి వివ‌రించారు.

కాలునొప్పి అంటే మామూలే క‌దా అనుకున్నాం

ఈ సంద‌ర్భంగా పాప తండ్రి మాట్లాడుతూ, “మా పాప‌కు రెండు వారాల పాటు వ‌రుస‌గా కాలినొప్పి రావ‌డంతో ముందు స్ప్రేలు, జెల్స్ వాడాం. త‌గ్గ‌క‌పోవ‌డంతో ద‌గ్గ‌ర్లో ఉన్న ఆర్థోపెడిక్ వైద్యుడికి చూపించాం. ఆయ‌న అనుమానంతో ఎక్స్ రే, ఎంఆర్ఐ చేయించారు. లోప‌ల ట్యూమ‌ర్ ఉంద‌ని, కేన్స‌ర్ కావ‌చ్చ‌ని అమోర్ ఆస్ప‌త్రికి వెళ్ల‌మ‌న్నారు. ఇక్క‌డ‌కు రాగానే డాక్ట‌ర్ కిశోర్ రెడ్డి బ‌యాప్సీ చేయించి, ఐదోరోజునే కీమో మొద‌లుపెట్టారు. త‌ర్వాత ఆప‌రేష‌న్ చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ కీమోలు కొన‌సాగుతున్నాయి. అక్క‌డి ఫిజియోథెర‌పిస్టులు ఇంటికి వ‌చ్చి చేయిస్తున్నారు. చాలా మంచి చికిత్స జ‌రుగుతోంది. నేను, పాప ఒక్కోసారి కాస్త ఆందోళ‌న‌కు గురైనా, నా భార్య మాత్రం మాకు చాలా ధైర్యం చెప్పింది. పిల్ల‌ల‌కు ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌ల్లిదండ్రులు వెంట‌నే గ‌మ‌నించి త‌గిన వైద్యుల వ‌ద్ద‌కు తీసుకెళ్లి చికిత్స చేయించ‌డం చాలా ముఖ్యం. ఏమాత్రం ఆల‌స్యం చెయ్య‌కూడ‌దు” అని తెలిపారు.

About Author