PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

20 ఏళ్ల విద్యార్థికి దుప్పి కొమ్ముల్లా పెరిగిన కిడ్నీ రాళ్లు

1 min read

* ఝార్ఖండ్ విద్యార్థికి ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రిలో చికిత్స‌

* విజ‌య‌వంతంగా రాళ్ల‌ను తొల‌గించిన వైద్యులు

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్ : మూత్ర‌పిండాల్లో భారీ ప‌రిమాణంలో ఉన్న రాళ్ల‌ను కీహోల్ స‌ర్జ‌రీ ద్వారా తొలగించి, 20 ఏళ్ల విద్యార్థికి న‌గ‌రంలోని సికింద్రాబాద్‌ ఏఐఎన్‌యూ వైద్యులు ఊర‌ట క‌ల్పించారు. అతడి స‌మ‌స్య‌ను, అందించిన చికిత్స వివ‌రాల‌ను ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ సూర‌జ్ పిన్ని తెలిపారు. “ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ ఫార్మ‌సీ విద్యార్థి కిడ్నీ స‌మ‌స్య‌తో ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. ప‌రీక్ష‌లు చేయ‌గా, అత‌డికి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయి గానీ, అవి అసాధార‌ణ ప‌రిమాణంలో ఉన్న‌ట్లు తేలింది. అవి 9.5x6x4 సెంటీమీట‌ర్ల ప‌రిమాణంలో ఉన్నాయి. అంతేకాక‌, వాటికి కొమ్ముల్లా కూడా ఏర్ప‌డి, అచ్చం ప్ర‌తి రాయీ దుప్పికొమ్ము త‌ర‌హాలో క‌నిపించింది. అందువ‌ల్ల వీటిని దుప్పికొమ్ము రాళ్లు అని అంటారు. సీటీ స్కాన్ తీసి చూసిన‌ప్పుడు అత‌డికి స‌మాంత‌రంగా రెండు వెన్నెముక‌లు ఉన్న‌ట్టుగా క‌నిపించింది. సాధార‌ణంగా మూత్ర‌పిండాల్లో రాళ్లు కొన్ని ర‌కాల సాల్ట్‌ల వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. మూత్ర‌పిండంలో మూత్రం చేరేచోట అవి ఉంటాయి. మూత్ర ఇన్ఫెక్ష‌న్‌, జ‌న్మ‌తః వ‌చ్చే స‌మ‌స్య‌లు, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాలు, ప‌ర్యావ‌ర‌ణం, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల కూడా ఇవి ఏర్ప‌డ‌తాయి. దుప్పికొమ్ము రాళ్లు ఫాస్ఫేట్ సాల్ట్ వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. సాధార‌ణంగా అయితే రాళ్లు మూత్ర‌నాళానికి అడ్డు ప‌డిన‌ప్పుడు తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. కానీ ఈ త‌ర‌హా రాళ్లు మాత్రం నెమ్మ‌దిగా పెరుగుతూ, కొద్దిపాటి నొప్పితో మొద‌ల‌వుతాయి. దాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే ఈ ప‌రిమాణంలోకి వ‌చ్చేస్తాయి. ఇలాంటి రాళ్లు ఏర్ప‌డ‌టానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఝార్ఖండ్ విద్యార్థికి రాళ్లు ఏర్ప‌డిన‌ప్పుడు వాటి గురించి తెలుసుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. అవి అత‌డి చిన్న వ‌య‌సులోనే మొద‌లై ఉండొచ్చు. కొన్ని నెల‌ల క్రితం అత‌డికి యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చాక గానీ అది తెలియ‌లేదు.  వివిధ ర‌కాల శ‌స్త్రచికిత్స‌ల ద్వారా రాళ్ల‌ను పూర్తిగా తీసేయ‌డ‌మే మంచిది. వేర్వేరు ఆస్ప‌త్రుల‌కు ఈ విద్యార్థి వెళ్లిన‌ప్పుడు సాధార‌ణ శ‌స్త్రచికిత్స‌చేస్తామ‌ని చెప్పారు. అయితే దానివ‌ల్ల పెద్ద మ‌చ్చ ప‌డ‌టంతో పాటు కోలుకోడానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కోసారి మూత్ర‌పిండాలు పూర్తిగా పాడ‌య్యే ప్ర‌మాద‌మూ ఉంటుంది. దాంతో 3డి రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఇమేజింగ్ లాంటి ప‌రీక్ష‌లు చేశాక‌, కీహోల్ స‌ర్జ‌రీ ద్వారా పెర్క్యుటేనియ‌స్ నెఫ్రోలితోటమీ చేశాం. 4 నుంచి 5 మిల్లీమీట‌ర్ల ప‌రిమాణంలో 5 రంధ్రాలు చేసి, వాటి ద్వారా మొత్తం రాళ్ల‌ను చిన్న‌విగా ప‌గ‌ల‌గొట్టి, అన్నింటినీ బ‌య‌ట‌కు తీసేశాం. మూడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టిన ఈ శ‌స్త్రచికిత్స నుంచి స‌ద‌రు విద్యార్థి పూర్తిగా కోలుకున్నాడు. అయితే దీర్ఘ‌కాలంలో రాళ్లు మ‌ళ్లీ ఏర్ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఏమిటి తేడా?

సాధార‌ణ కిడ్నీ రాళ్ల‌కు, దుప్పికొమ్ము రాళ్ల‌కు వాటి తీరు, ల‌క్ష‌ణాల‌తో పాటు చికిత్స చేసే విధానం కూడా మారుతుంది. యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్ఫెక్ష‌న్ వల్ల ఇవి ఏర్ప‌డ‌తాయి. మిగిలిన రాళ్లు శ‌రీరంలో ఉండే సాల్ట్‌ల కార‌ణంగా ఏర్ప‌డ‌తాయి. సాధార‌ణ రాళ్ల‌యితే మూత్ర‌నాళంలోకి ప‌డిన‌ప్పుడు తీవ్ర‌మైన నొప్పి, వికారం కూడా క‌లుగుతుంది. దుప్పికొమ్ము రాళ్ల వ‌ల్ల కొద్దిపాటి నొప్పి లేదా అస‌లు లేక‌పోవ‌డం ఉంటుంది” అని డాక్ట‌ర్ సూర‌జ్ పిన్ని వివ‌రించారు.శ‌స్త్రచికిత్స‌లో డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర కుల‌క‌ర్ణి, డాక్ట‌ర్ గోపాల్ త‌క్ మ‌రియు డాక్ట‌ర్ సిహెచ్ శ్రీనివాస‌రావు పాల్గొన్నారు.

About Author