వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి
1 min read– తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి
– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వాలంటీర్ సహాయం లేకుండా ఇంటింటి సర్వే మరియు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమము-2024కు సంబంధించి జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మరియు ఎన్నికల ఉపతహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే మరియు ఓటరు జాబితా సవరణ కార్యక్రమము నిర్వహించాలని, ఎటువంటి లోపాలకు తావివ్వకుండా 2024 తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అవసరమైన మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్- 2024 లో ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. గ్రామ/వార్డు వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన ఏవిధమైన పనులలోనూ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈఆర్వో, ఎఈఆర్వోలకు ఆదేశించారు. ఈఆర్వో, ఎఈఆర్వోలు వారి సంబంధిత బూతు స్థాయి అధికారులకు ఇంటింటి సర్వే మరియు స్పెషల్ సమ్మరీ రివిజన్- 2024 కి సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. బూత్ స్థాయి అధికారులతో ఇంటింటి ఓటర్ల పరిశీలన చేస్తున్న సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి అపోహలు ఉండకుండా, అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వారు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకొమని సూచిస్తూ, మీ ద్వారా వారికి మీ పర్యటన వివరాలు ముందస్తు సమాచారం వారికి ఇచ్చి వారు కూడా ఇంటింటి ఓటరు సర్వేలో భాగస్వామ్యుల అయ్యేలా చూడాలన్నారు. అలాగే బూత్ స్థాయి ఏజెంట్ల ఎంపిక చేసి జాబితాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయమునకు సమర్పించాలన్నారు. తప్పనిసరిగా ఉండే విధంగా తగు ముందస్తు సమాచారమిచ్చి పాల్గొనే విధంగా చూడాలని ఆదేశించారు. అప్పుడు గుర్తించిన మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన లిస్ట్ తయారు చేసి సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం చేయాలని ఆదేశించారు.ఈఆర్ఓ, ఎఈఆర్ఓలు వారి సంబంధిత నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలవారి ఓటరు నమోదు మరియు తొలగింపులను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతనే ఆమోదించాలన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాలలోని మరణించిన వారి జాబితాను మరణ ధ్రువీకరణ పత్రము లేదా పంచనామ ద్వారా ధ్రువీకరించి, క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాతనే ఓటరు జాబితా నుంచి తీసివేయాలన్నారు. ఒకే ఇంటిలో ఎక్కువ మొత్తములో ఓటర్లు ఉంటే ఆ ఇంటిని పరిశీలన చేసి, ఆ ఇంటిలో ఎక్కువ మంది వేరువేరుగా నివాసాలు ఉన్న యెడల ప్రధాన ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు వారికి ఒక పద్దతి ప్రకారం ఇంటి నెంబరు ఇవ్వాలన్నారు. ఒక ఇంటి నెంబర్ లో ఉన్న ఓటర్లను అందర్నీ ఒకే పోలింగ్ బూత్ లో చేర్చాలని , ప్రతి ఓటరు తన ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ చేరుకునే విధంగా ఏర్పాటు చేయాలని పోలింగ్ స్టేషన్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించినారు. ఈఆర్ఓ, ఏఈఆర్ఓ మరియు ఎన్నికల తహశీల్దార్లు వారి సంబంధిత నియోజకవర్గములోని ప్రతి యొక్క కళాశాలలో SVEEP కార్యక్రమాలను నిర్వహించాలని, మరియు ఇప్పటి వరకు నమోదుకాని ప్రతి ఒక్కరిని నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఎవరు కూడా ఓటు హక్కు లేకుండా ఉండకూడదనే దృఢ నిశ్చయంతో ట్రాన్స్ జెండర్స్ , సెక్స్ వర్కర్లు మొదలగువారు ఓటర్లుగా నమోదు చేయవలసిందిగా అదేశించారు. ప్రస్తుతము వయస్సు 17 సంవత్సరాలు ఉండి జనవరి 2024 సంవత్సరానికి 18 సంవత్సరాలు వచ్చే వారిని కూడా గుర్తించి సమాచారాన్ని సేకరించి పెట్టుకోవాలని అదేశించారు. 90 సంవత్సరాలు నిండిన వారు నడవలేని పరిస్థితిలో ఉంటే మరియు పూర్తిగా వికలాంగులు అయి నడవలేని పరిస్థితిలో ఉన్న వారికి ఇంటి దగ్గరే ఓటు వేసుకునే అవకాశం కల్పించడానికి తగిన సమాచారం సేకరించి పెట్టుకోవాలని కలెక్టర్ అదేశించారు. జిల్లాలో పెరుగుతున్న జనాభా నిష్పత్తి ప్రకారము ఓటర్లు నిష్పత్తి కూడా పెరగవలసిన అవసరం ఉంటుంది మరియు జిల్లా నుండి వెళ్లిపోయిన వారి ఓట్లు , మరణించిన వారి ఓట్లు తొలగించాలని వాటికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించుకొని ఓటర్ల లిస్టు నుంచి తొలగించాలని అదేశించారు.ఈఆర్ఓలు మరియు ఎఈఆర్ఓలు, బూత్ స్థాయి అధికారులు చేసేటువంటి ఇంటింటి సర్వేని పరిశీలించి జాగ్రత్తతో ఎన్నికల కమీషన్ వారి ఆదేశాలు తుచాతప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ అదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.