భవిష్యత్తు ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవాలి.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readసెయింట్ జోసెఫ్ కళాశాలలో ఫిస్టా 2కె24 కార్యక్రమంలో పాల్గొన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మొదటిసారి ఓటు వేసే వారందరూ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాలలో వారం రోజుల పాటు జరుగుతున్న ఫిస్టా 2కె24 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్లాలన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించడం చాలా కష్టమైందన్నారు. ప్రతి విద్యార్థి కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాలపై పట్టు సాధించాలని సూచించారు. ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. యువత భవిష్యత్తుకు మంచి మార్గం చూపేందుకు కర్నూల్లో తాను బాధ్యతగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తమ టిజివి సంస్థల తరుపున దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పారు. అయితే అధికారంలో ఉంటే ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పారు. సరైన నాయకుడు, సరైన ప్రభుత్వం ఉంటే మంచి పాలన అందుతుందన్నారు.