PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర చరిత్రలో సువర్ణధ్యాయం

1 min read

పల్లెవెలుగువెబ్ రాయచోటి అన్నమయ్య జిల్లా : రాష్ట్ర చరిత్రలో సువర్ణధ్యాయం మొదలయ్యింది. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మెరుగైన.. నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ… ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను నూతనంగా ఏర్పాటు చేస్తూ.. సోమవారం ఉదయం వర్చువల్ విధానంలో 13 నూతన జిల్లాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాగా ఏర్పాటైన రాయచోటికి నూతన జిల్లా కలెక్టర్ గా వచ్చిన శ్రీ గిరీష్ పీఎస్, జేసి తమీమ్ ఆన్సరియా, ఎస్పి హర్షవర్ధన్ రాజు లకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. కొత్తగా జిల్లాకు విచ్చేసిన కలెక్టరు, ఎస్పి మరియు జేసి లకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఆత్మీయ ఆహ్వానం పలికిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంఎల్సీ వైస్ ఛైర్మన్ జకియా ఖానం, జడ్పీ చైర్మన్ ఆకెపాటి అమర్ నాధ్ రెడ్డి, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాయచోటి కేంద్రంగా నూతన అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, జెసి తమీమ్ ఆన్సరియా, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్, జేసి తమీమ్ ఆన్సరియా,జిల్లా విద్యా శాఖాధికారి రాఘవరెడ్డి మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాయచోటి నూతన అన్నమయ్య జిల్లా ఆవిష్కరణలో భాగంగా రాయచోటి కలెక్టర్ వారి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, పీలేరు ఎమ్యెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కలెక్టర్ గిరీష్ పిఎస్, ఎస్పీ హర్షవర్డ్ రాజు, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీ, ఎంఎల్సీ వైస్ ఛైర్మన్ జకియా ఖానం, ఎంఎల్సీ కత్తి నరసింహా రెడ్డి, డిఆర్ఓ టి. బాపిరెడ్డి, రాయచోటి, రాజంపేట, మదనపల్లి ఆర్డీవోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజలకు మేలు.. కొత్త జిల్లాల ఆవిష్కరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్

వర్చువల్ విధానంలో నూతన జిల్లాలను ఆవిష్కరించిన అనంతరం జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు నేటి నుంచి ప్రారంభం అవుతుందన్నారు. ముందుగా 26 జిల్లాలతో ఏపీ రాష్ట్రం రూపుమారుతున్న సందర్భంగా.. ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించిన ఆయన.. ప్రజల సెంటిమెంట్లను, గొప్పవాళ్లను, రాష్ట్రంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాకే 13 నూతన జిల్లాలు, 21 కొత్త రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశామని, వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసిన జిల్లాలలో ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదని, సుమారు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని.. ప్రస్తుతం 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పరిపాలన, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని చెప్పారాయన. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని, ఏరకంగా చూసుకున్నా ఇదే సరైన విధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేడు కొత్త జిల్లాల ఏర్పాటు తో పరిపాలనా విధానంలో ఒక ఫిలాసఫీ తీసుకు రావడం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షలు తనకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా కొత్త జిల్లా ఏర్పాటులో 15 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేటు, ఎస్పీ ఆఫీస్, మిగిలిన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ఒక గొప్ప వ్యవస్థ రాబోతోందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని… ఇందులో భాగంగా కలెక్టర్లకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను నిర్దేశించడం జరిగిందన్నారు. ఈ లక్ష్యాన్ని ప్రతి కలెక్టరు ఒక ప్రధాన అంశంగా పరిగణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు స్టాండర్డ్ ఆపరేషనల్ టూల్ను ఒక హాండ్ బుక్ రూపంలో తీసుకురావడం జరిగిందని వివరించి.. ఆ హాండ్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వివిధ అంశాలలో కలెక్టర్లకు, జేసిలు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ నుంచి రాయచోటి పట్టణం లోని కూడలి వరకు… కలెక్టర్, జేసి, ఎస్పి, ఎంఎల్సీలు, ఎమ్మెల్యే లు, అధికారులు ప్రదర్శనగా భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రముఖులు నాయకులు ప్రభుత్వ విప్ ను, నూతన కలెక్టరు, జేసీ, ఎస్పీలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలోజిల్లా పరిపాలనా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author