భారత సైన్యంలోకి చేరాలనుకునేవారికి సువర్ణావకాశం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్మీలో పనిచేయాలని కలలు కనే యువకుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పేరుతో ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమైంది. దివంగ త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆలోచనలతో పురుడుపోసుకుని, ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా స్వచ్ఛందంగా సైన్యంలో సేవలందించేందుకు యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో మూడేళ్ల పాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు. అగ్నిపథ్‌లో సైన్యంలో చేరే జవాన్లను ‘అగ్ని వీర్’గా పిలుస్తారు. వీరు జనరల్(యుద్ధ సైనికులు), టెక్నికల్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
విధులు ముగిశాక..
సైన్యం/త్రివిధ దళాల్లో మూడేళ్ల పాటు సేవలందించిన యువకులకు ఇతర ప్రభుత్వోద్యోగాలు, కార్పొరేట్ కొలువుల్లో ప్రాధాన్యత ఉంటుంది. పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే దీనిపై కేంద్రానికి హామీ ఇచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్ల సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఆయా విభాగాల్లో ‘శాశ్వత’ ఉద్యోగి/జవానుగా కొనసాగించే అవకాశాలుంటాయి. ఇప్పటికే త్రివిధ దళాల్లో అధికారి స్థాయిలో ఈ తరహా నియామకాలు ఉన్నాయి. ‘షార్ట్ సర్వీస్ కమిషన్’ ద్వారా అధికారుల నియామకాలు జరుగుతాయి. వారు 3 లేదా 5 ఏళ్లకు కాంట్రాక్టుపై త్రివిధ దళాల్లో పనిచేస్తారు. తర్వాత ప్రతిభను బట్టి పూర్తిస్థాయి సర్వీ్‌స లో కొనసాగుతారు. అగ్నిపథ్ పథకాన్ని కూడా ఇలాగే కొనసాగించే అవకాశాలున్నాయని అంచనా. వీరికి నిర్ణీత కాలం వరకు ‘జాతీయ పెన్ష న్ పథకం’ అమలు, వైద్య సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది.