NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన  అమెరికా ప్రతినిధుల బృందం

1 min read

APCNF రైతులతో     పరస్పర చర్చలు జరిపిన పెగాసస్ క్యాపిటల్ ప్రతినిధులు

సురభి గోశాలను సందర్శించి 9 సార్వత్రిక సూత్రాలను పరిశీలన 

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ  (ఏపీసీఎన్ఎఫ్) కార్యక్రమాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్రంలో చేపడుతున్న పర్యటనలో భాగంగా  అమెరికా కు చెందిన పెగాసస్ క్యాపిటల్  ప్రతినిధుల బృందం గురువారం 20 వ తేదీన ఏలూరు జిల్లాలోని  ఉంగుటూరు మండలంలోని ఏ.గోకవరం మరియు భీమడోలు మండలంలోని వడ్లపట్ల, కోడూరుపాడు  గ్రామాలను సందర్శించింది. ఈ బృందంలో వైట్ హౌస్ మాజీ జాతీయ వాతావరణం సలహాదారు గీనా మెకార్తీ, పెగాసస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈ ఓ క్రేగ్ కాట్ మరియు ప్రొడ్యూసర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ కీత్ అగోడా ఉన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి. విజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన క్షేత్ర పర్యటనలో భాగంగా బృంద సభ్యులు తొలుత  ఏ గోకవరం గ్రామంలోని “సురభి” గోశాలను సందర్శించి ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో అనుసరిస్తున్న విత్తన గుళికల తయారీ , ఘన జీవామృతం,  అగ్నాస్త్రం  వంటి  విధానాలను గమనించారు. అనంతరం  టి. మల్లేష్ పొలంలో ఏటీఎం (ఎనీ టైమ్ మనీ) మోడల్ తో పాటు  నీటితో  ప్రయోగాత్మకంగా  వివిధ వ్యవసాయ విధానాల్లో బియ్యం ఉత్పాదకతను విశ్లేషించారు. ఆ తర్వాత భీమడోలు మండలంలోని కోడూరుపాడు గ్రామంలో ఏపీసీఎన్ఎఫ్ మెంటార్ ఇంటర్న్ కె. కళ్యాణ్ కుమార్ అమలు చేసిన A-గ్రేడ్ ప్రకృతి  వ్యవసాయ నమూనాను రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసే ఎన్. రాంబాబు పొలంతో పోల్చి రెండింటికీ మద్య గల వ్యత్యాసాన్ని గమనించారు. తర్వాత  బృందం సభ్యులు  శ్రీ యు. రామచంద్ర రావుకి చెందిన  8 ఎకరాల కొబ్బరి తోటను సందర్శించారు. కొబ్బరి తోటలో వేసిన అరటి, వక్క, కూరగాయల వంటి అంతర పంటలను రసాయన ఆధారిత వ్యవసాయం చేసే శ్రీ ఎన్. రాంబాబు పొలంతో పోల్చి చూశారు. అనంతరం ప్రతినిధుల బృందం కృష్ణ రాఘవ ప్రకృతి వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో  ద్వారా  ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌కు అవసరమైన బహుళ  పంటల విత్తన కిట్లు మరియు ఇతర వ్యవసాయ ముడిపదార్థాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రకృతి వ్యవసాయ రైతులకు అవసరం అయ్యే వనరులను అందించడం పట్ల అభినందనలు తెలిపారు. భీమడోలు మండలంలోని వడ్లపట్ల గ్రామంలో శ్రీనివాస స్వయం సహాయక సంఘం (SHG) సభ్యులు మరియు  స్థానిక రైతులతో మాట్లాడారు.  ప్రకృతి  వ్యవసాయ పొలాలలో డ్రోన్ సహాయంతో జీవ ఉత్ప్రేరకాలను స్ప్రేయింగ్ చేసే విధానం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు  రైతులను రసాయన వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయానికి ఎలా మార్చుతున్నారనే విషయంపై చర్చించారు.  రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను మరింత బలోపేతం చేయడానికి ఈ బృంద పర్యటన మరొక కీలకమైన ముందడుగు అని రైతు సాధికార అధికారులు అభివర్ణించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె హబీబ్ బాషా,రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు   అరుణ, ప్రభాకర్,విషి,  ఏపీసీఎన్ఎఫ్ జిల్లా మేనేజర్  తాతారావు తదితరులు పాల్గొన్నారు.

About Author