PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాలుగేళ్ల బాబు గుండె చుట్టూ అరలీటర్ చీము

1 min read

* ఇన్ఫెక్షన్‌తో దెబ్బతిన్న ఊపిరితిత్తులు

* ఆధునిక చికిత్సతో ప్రాణాలు కాపాడిన కిమ్స్ కర్నూలు వైద్యులు

* ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నాలుగేళ్ల బాబుకు గుండె చుట్టూ అరలీటర్ మేర చీము పేరుకుపోయి ఊపిరితీసుకోవడం కష్టంగా మారింది. అత‌డికి క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద పూర్తి ఉచితంగా అత్యాధునిక చికిత్స చేసి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఈ వివరాల‌ను ఆస్ప‌త్రికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్ట‌ర్‌ భరత్ రెడ్డి, ఐసియు స్పెషలిస్ట్ డాక్ట‌ర్‌ నవీన్ రెడ్డి, డాక్ట‌ర్‌వాసు, డాక్ట‌ర్ రవి వెల్లడించారు. “కర్నూలుకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 4 ఏళ్ల బాబుకు జ్వరం, ఆయాసం రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయాసం ఎక్కువ కావడంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఇక్క‌డ బాబును వెంట‌నే చూసి, పరిస్థితి విషమంగా ఉందని గ్రహించి పీఐసీయూలో చేర్చాం. బాబుకి  బీపీ తక్కువ ఉండటంతో ముందుగా దాన్ని పెంచేందుకు సెలైన్, అడ్రెనలిన్ మొదలుపెట్టాం. ఇన్ఫెక్షన్ త‌గ్గ‌డానికి యాంటీబ‌యాటిక్స్, ఊపిరి అందేందుకు ఆక్సిజన్ మొదలు పెట్టాం. అయినా మెరుగుప‌డ‌క‌పోవ‌డంతో, గుండెకి స్కానింగ్ చేయ‌గా, గుండె చుట్టూ చీము చేరిందని గుర్తించాం. యూఎస్‌జీ స్కాన్ సాయంతో గుండె చుట్టూ ఉన్న చీమును బ‌య‌ట‌కు తీసేందుకు ఒక చిన్న పైపును గుండెలోకి అమ‌ర్చి, గట్టిగా తాడులా ఏర్పడ్డ ఆ చీము కరగడానికి ఒక ఇంజక్షన్ ఇచ్చి రెండు రోజుల్లో మొత్తం అర‌లీట‌రుకు పైగా చీమును బయటకు తీశాం. తర్వాత ఆయాసం, జ్వరం తగ్గాయి. బాబు పరిస్థితి కొద్ది కొద్దిగా బాగుప‌డుతుండ‌గా, మ‌ళ్లీ ఆయాసం ఎక్కువ కావడంతో, స్కానింగ్ చేసి క్షుణ్ణంగా పరీక్షించి కుడివైపు ఊపిరిదితుల చుట్టూ చీము ఉంద‌ని గుర్తించాం. దానికి శ‌స్త్రచికిత్స అవ‌స‌రం కావ‌డంతో వెంట‌నే పిల్లల శ‌స్త్రచికిత్స నిపుణుడు డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ రంగంలోకి దిగారు. ఆయ‌న వెంట‌నే ఆప‌రేష‌న్ చేసి, ఊపిరితిత్తుల చుట్టూ పేరుకుపోయిన చీమును తొల‌గించారు. స‌రైన స‌మ‌యానికి త‌గిన చికిత్స అందించ‌డం, యాంటీబ‌యాటిక్స్ వాడ‌టం, ఇత‌ర ప్ర‌క్రియల‌కు తోడు అద్భుతమైన నర్సింగ్ కేర్ వల్ల ఒక వారం పీఐసీయూలో, మ‌రోవారం వార్డులో ఉండి, బాబు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. ఈ వైద్యం అంతా కూడా ఆరోగ్యశ్రీ పథ‌కంలో పూర్తి ఉచితంగా చేయ‌డం విశేషం” అని తెలిపారు.బాబుకి వైద్యం అందించిన డా. భరత్ రెడ్డి, డా. నవీన్ రెడ్డి మాట్లాడుతూ  “సాధారణంగా సెప్సిస్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి. శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా సెప్సిస్ రావడానికి అవకాశం ఉంది. దీనివ‌ల్ల శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి, బీపీ పడిపోతుంది, ఊపిరి అందదు. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావ‌చ్చు. దీన్ని త్వరగా గుర్తించి, సరైన మోతాదులో సెలైన్, ఇన్ఫెక్షన్‌ని అంచనా వేసి తగిన యాంటీబ‌యాటిక్స్ మొదలుపెట్టడం దీని చికిత్స‌లో చాలా ముఖ్యం. ఒక్కోసారి దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండి వెంటిలేటర్ పెట్టి, డయాలిసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యాధి వచ్చిన పిల్లలను ప్ర‌త్యేకంగా పిల్ల‌ల ఐసీయూలో ఉంచి వైద్యం చేయవలసి ఉంటుంది” అని వివరించారు.

About Author