లైబ్రరీ అంటే ఇతరులకు జ్ఞానం పంచేస్ధలం..
1 min readచదివే ప్రతిపుస్తకం జీవితంలో విజయానికి కొత్తమార్గాన్ని చూపుతుంది..
పలు పాఠశాలల్లో సియస్ఆర్ నిధులతో నిర్మించిన లైబ్రరీ గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మనం చదివే ప్రతి పుస్తకం జీవితంలో విజయానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం కార్పోరేట్ సామాజిక బాధ్యత (సియస్ఆర్) నిధులతో రూ. 10 లక్షలు కస్తూరిభా నగరపాలక బాలికోన్నతపాఠశాలలో, రూ. 24 లక్షలతో ఆదివారపుపేటలోని ఎఆర్ డిజికె నగరపాలక ఉన్నతపాఠశాలలో నిర్మించిన లైబ్రరీ గదులను ఆయన ప్రారంభించారు. లైబ్రరీకి సంబంధించిన పలు పుస్తకాలను ఈ సందర్బంగా ఆయన ఆవిష్కరించారు. లైబ్రరీ నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించేవిధంగా జ్ఞానానిచ్చే అన్నిరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్ధులను జ్ఞానవంతులుగా చేసి సమాజానికి తోడ్పడే నైతిక బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా చేయడంలో లైబ్రరీలు దోహదపడతాయన్నారు. సమాచార జ్ఞానం కలిగిన విద్యార్ధులు తమ సొంతంగా చదువుకునే శక్తి కలిగి వారికి కావాల్సిన సమాచార అవసరతలను గుర్తేరిగి సరైన ఆలోచన విధానంతో నడుచుకుంటారన్నారు. విద్యార్ధులు తమకు నచ్చిన పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదవి తిరిగి వాటిని పాఠశాలలోని గ్రంథాలయంలో భధ్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయ నిర్వహణకోసం ఒక ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సియస్ఆర్ నిధులతో రూ. 10 లక్షలు చొప్పున కస్తూరిభా నగరపాలక బాలికోన్నతపాఠశాల, కొవ్వలి జెడ్పి పాఠశాలలో లైబ్రరీ గదులను ఏర్పాటు చేయగా ఏలూరు నగరపాలకసంస్ధ ఆధ్వర్యంలో రూ. 24 లక్షలతో ఆదివారపుపేటలోని ఎఆర్ డిజికె నగరపాలక ఉన్నతపాఠశాలలో లైబ్రరీ గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లైబ్రరీలో మరిన్ని విజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలను ఇతరుల నుంచి కూడా సేకరించాలని తాముకూడా ఇందుకు సహకరిస్తామన్నారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటుచేసిన లైబ్రరీలపై విద్యార్ధిని విద్యార్ధులతో కలెక్టర్ మాట్లాడుతూ లైబ్రరీ ఏర్పాటుపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. దానిపై వారు పాఠశాలల్లో లైబ్రరీ గదిని ఏర్పాటు చేయడం పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ లైబ్రరీలో ఉన్న దిన పత్రికలు, ఇతర విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలను చదివి మరింత విజ్ఞాన వంతులు కావాలన్నారు. పదోతరగతి విద్యార్ధులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన జిల్లా కలెక్టర్ ఆయా పాఠశాలల్లో లైబ్రరీ గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అక్కడ ఉన్న పదోతరగతి విద్యార్ధులతో ముచ్చటిస్తూ రానున్న పరీక్షల్లో విజయవంతులు కావాలని విద్యార్ధులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. పరీక్షలకు వున్న సమయాన్ని వృధాచేయకుండా విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ్ సుందర్, నగరపాలక సంస్ధ అదనపు కమీషనరు బాపిరాజు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉజ్వల, జి. సునీత, పలువురు నగరపాలక సంస్ధ ఇంజనీర్లు, టీచర్లు,తదితరులు పాల్గొన్నారు.