కులం పేరుతో ఓట్లు అడిగే వారిని ముస్లిం అక్కచెల్లెమ్మలు నమ్మొద్దు..
1 min readకర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కులం, మతం పేరు చెప్పి ఓట్లు కొల్లగొట్టాలని చూసే స్వార్ధపరులను నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టిజి భరత్ ముస్లిం మహిళలను కోరారు. నగరంలోని రోజా ప్రాంతంలో ఉన్న విశ్వ గార్డెన్ లో 48, 49 వార్డులకు చెందిన మహిళల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో భరత్ పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. మరి కొద్ది రోజుల్లో రంజాన్ పండుగ రాబోతుందని తమ ప్రభుత్వం ఉంటే ప్రతి పేద ముస్లింకి రంజాన్ తోఫా అందించే వారమని చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రంజాన్ తోఫాను ఎత్తేసిందన్నారు. పేద ముస్లిం మహిళల పెళ్లిళ్ల కోసం దుల్హన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తే.. వైసిపి ప్రభుత్వం వచ్చాక లక్ష రూపాయలు అందిస్తామని చెప్పి ఆ తర్వాత నిబంధనలు పెట్టి ముస్లింలకు అందకుండా చేశారని మండిపడ్డారు. ఇక కర్నూల్ లో తమ టీజీవి సంస్థల తరఫున ముస్లింలకు ఎంతో మేలు చేశామన్నారు. ఏ కుటుంబానికి ఆపదొచ్చినా తాము ముందుండి ఆదుకున్నామని గుర్తు చేశారు. దశాబ్దాలుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్న తమను ప్రజలు ఆదరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ముస్లిం మహిళలను కోరారు. ప్రస్తుతం కర్నూల్ లో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేయనున్నారని, ఇలాంటి నాయకులు కొనసాగితే మూడు రోజులకు ఒకసారి, లేదంటే వారానికి ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితులు వస్తాయన్నారు. తనలాంటి సరైన నాయకుడు ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.