మనిషికి ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు…
1 min readదురాలవాట్లకు దూరంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం.సీనియర్
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మనిషికి ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని చదువుల రామయ్య నగర్ లో చంద్ర రాజేశ్వరరావు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఆరోగ్యం సరిగా లేకపోతే వారి జీవితం దుర్భరంగా ఉంటుందని వివరించారు అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనదేశంలో పోషకాహార లోపం వల్ల చాలామంది వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిస్థితులకు అనుగుణంగా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ముఖ్యంగా నీటి కాలుష్యం వల్ల కలరా, టైఫాయిడ్, పసిరికలు ,అమీబియాసిస్ వంటి అనేక వ్యాధులు వస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని వాడాలని ఆయన సూచించారు. అలాగే చాలామంది ఆల్కహాల్ కు బానిసలుగా మారుతున్నారని వివరించారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీర్ణకోశ వ్యాధులతో పాటు లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తాయని ఆయన వివరించారు.. ఒకసారి లివర్ సిరోసిస్ వంటి వ్యాధి వచ్చింది అంటే మనిషి ప్రాణానికే ప్రమాదం అని ఆయన చెప్పారు ఇందుకు సంబంధించి చికిత్సలు కూడా చాలా ఖరీదైనమని ఆయన తెలిపారు .అలాగే చాలామంది పొగాకు వినియోగిస్తున్నారని దీని వల్ల 18 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పొగాకు తాత్కాలికంగా ఉత్తేజాన్ని ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో మనిషి ప్రాణానికి ప్రమాదకరంగా మారుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా చదువుల రామయ్య నగర్ వంటి పేదల నివసించే ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని వివరించారు. ప్రజలు చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల కూడా అవగాహనతో మెలగాలని సూచించారు. ముఖ్యంగా అపరిశుభ్రత ఉండటం వల్ల దోమలు వ్యాప్తి చెంది దోమ కాటు వల్ల ఎంతోమంది ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు తాము తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలని ,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి వాటిని తమ ఆహారంలో తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు అని తెలిపారు. ప్రజలు బయటికి వెళ్లినప్పుడు మాస్కు ధరించడం వల్ల వివిధ రకాల అలర్జీలు రాకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించడంతోపాటు పోషక ఆహారాన్ని అందించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. చదువుల రామయ్య నగర్ లో ఉన్న పేదల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జగన్నాథం, రామకృష్ణారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.