PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుమారుడికి పున‌ర్జ‌న్మ ఇచ్చిన త‌ల్లి

1 min read

– 21 ఏళ్ల వ‌య‌సులోనే మూత్ర‌పిండాల స‌మ‌స్య‌

– త‌న కిడ్నీ దానం చేసిన క‌న్న త‌ల్లి

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్ : అతి చిన్న వ‌య‌సులోనే కిడ్నీ స‌మ‌స్య వ‌చ్చిన ఓ యువ‌కుడికి అత‌డి త‌ల్లి త‌న కిడ్నీ దానం చేసి ప్రాణాలు పోశారు. న‌గ‌రంలోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ నెఫ్రాల‌జిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ చ‌ల్లా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.  ‘‘న‌గ‌రానికి చెందిన 21 ఏళ్ల విద్యార్థి గ‌త రెండు మూడేళ్ల నుంచి తీవ్ర‌మైన త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. నిజానికి అప్ప‌టికే అత‌డికి బీపీ పెరిగినా.. ఆ విష‌యాన్ని గుర్తించ‌లేక‌పోయాడు. కొన్నాళ్ల త‌ర్వాత నుంచి బ‌రువు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాడు, ఆక‌లి కూడా ఏమాత్రం లేదు. దాంతో ద‌గ్గ‌ర‌లో ఉన్న ఒక వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. మూత్ర‌పిండాలు దెబ్బ‌తిన్న విష‌యం గమ‌నించి, ఏఐఎన్‌యూకు పంపారు. ఇక్క‌డ‌కు వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత క్షుణ్ణంగా ప‌రీక్ష‌లు చేయ‌గా, అత‌డికి రెండు కిడ్నీలూ 10 సెంటీమీట‌ర్ల ప‌రిమాణంలో ఉండాల్సిన‌వి ఏడు సెంటీమీట‌ర్ల‌కు త‌గ్గిపోయాయి. సాధార‌ణంగా ఇలాంట‌ప్పుడు డ‌యాల‌సిస్ లేదా కిడ్నీ మార్పిడి మాత్ర‌మే చేయాల్సి ఉంటుంది. ఇత‌డి కేసులో ఇంకా చాలా జీవితం ఉండ‌టం వ‌ల్ల కిడ్నీ మార్పిడి మంచిద‌ని నిర్ధారించాము. అత‌డి త‌ల్లికి 42 ఏళ్లు కావ‌డంతో ఆమె అత‌డికి త‌న కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇటీవ‌లే ఆమె నుంచి కిడ్నీ తీసి ఇత‌డికి అమ‌ర్చాము. శ‌స్త్రచికిత్స విజ‌య‌వంతంగా జ‌రిగింది.

త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో సుదీర్ఘ జీవితంకిడ్నీ మార్పిడి చేయించుకోవ‌డంపై కొంత‌మందిలో ఇప్ప‌టికీ అపోహ‌లు ఉన్నాయి. కానీ, నేను 18 ఏళ్ల క్రితం మొద‌టిసారి కిడ్నీ మార్పిడి చేసిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇప్ప‌టికీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఇలా 17, 18 ఏళ్ల క్రితం మార్పించుకున్న‌వారు సైతం ఇప్పుడూ బాగున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న త‌ర్వాత మూడు నెల‌లు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆ త‌ర్వాత కూడా జీవ‌న‌శైలి విష‌యంలో చాలా మార్పులు చేసుకోవాలి. స‌రైన ఆహారం తీసుకోవాలి, ప‌రిశుభ్రంగా ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. జీవితాంతం కొన్ని మందులు వాడుతుండాలి. అలా చేస్తే సుదీర్ఘ‌కాలం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం గ‌డ‌ప‌వ‌చ్చు.

చిన్న‌వ‌య‌సులోనే బీపీ.. అందుకే కిడ్నీ వైఫ‌ల్యం

ఇటీవ‌లి కాలంలో కొంత‌మందికి చిన్న వ‌య‌సులోనే బీపీ బాగా ఎక్కువ‌గా పెరుగుతోంది. కానీ దాన్ని గుర్తించేస‌రికే ఆల‌స్యం అవుతోంది. నిజానికి కాళ్ల వాపులు, క‌ళ్ల వాపులు, బ‌రువు త‌గ్గ‌డం, మూత్రంలో ర‌క్తం ప‌డ‌టం, బీపీ పెర‌గ‌డం.. ఇవ‌న్నీ కిడ్నీ వ్యాధి ల‌క్ష‌ణాలే. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్పుడు త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. ఆక‌లి త‌గ్గినా, బ‌రువు త‌గ్గిపోతున్నా వెంట‌నే త‌గిన వైద్యుల‌కు చూపించుకోవాలి. ముందుగానే ఈ స‌మ‌స్య‌ను గుర్తిస్తే, కిడ్నీ బ‌యాప్సీ చేయించి మందుల‌తోనే చాలావ‌ర‌కు న‌యం చేయొచ్చు. మ‌రీ ఆల‌స్య‌మైతే కిడ్నీ ప‌రిమాణం త‌గ్గిపోతుంది. అప్పుడు ఇక కిడ్నీ మార్పిడి లేదా డ‌యాల‌సిస్ చేయాల్సి వ‌స్తుంది’’ అని డాక్ట‌ర్ చ‌ల్లా రాజేంద్ర‌ప్ర‌సాద్ వివ‌రించారు.

About Author