లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: బంజారాహిల్స్ లోని DAV స్కూల్ లో చదువుతున్న 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన హెడ్ మాస్టర్ యొక్క డ్రైవర్ భీమన రజనీ కుమార్ ని కఠినంగా శిక్షించాలని, ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ మాస్టర్ ఎస్.మాధవిపై చర్యలు తీసుకోవాలని AIDSO ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ AIDSO – AIMSS సంఘాల ఆధ్వర్యంలో పాత కంట్రోల్ రూమ్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి, ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమంలో బంజారాహిల్స్ లోని DAV స్కూల్ లో చదువుతున్న 4 సంవత్సరాల చిన్నారిపై అదే పాఠశాల హెచ్ఎం యొక్క కార్ డ్రైవర్ రజనీ కుమార్ లైంగిక దాడికి పాల్పడడం అమానుషమని, అనేక సార్లు ఈ డ్రైవర్ పై పిల్లల తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేసినా, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే తీరును AIDSO ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. హరీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు… DAV స్కూల్ హెచ్.ఎం యొక్క కార్ డ్రైవర్ ఈ చిన్నారిపై గత రెండు నెలలుగా హెచ్.ఎం రూమ్ పక్కనే ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్ లోనే అనేక మార్లు లోపలికి తీసుకొని వెళ్లి, డోర్ వేసుకుని, లైంగికంగా వేధిస్తుండేవాడని, ఈ మొత్తం విషయం తెలిసిన హెచ్.ఎం తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, మరింత ప్రోత్సహించే విధంగా వ్యవహరించారని అన్నారు… ఆ పాఠశాలలో ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఉన్నాయని తెలిసి, వాటి గురించి హెచ్.ఎం మాధవికి తెలియజేసినప్పటికీ వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. డ్రైవర్ రజనీకుమార్ స్కూల్ ఆవరణలో ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పటికీ, హెచ్ఎం చూసి చూడనట్లుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అనంతరం AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం. తేజోవతి మాట్లాడుతూ – తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కొరకు లక్షల రూపాయల ఫీజులను అప్పు అయినా చేసి స్కూల్ లో చేరిస్తే, అక్కడ కూడా వారి భద్రతకు ఎలాంటి రక్షణ లేకపోతే, ఎక్కడ చదివించాలనే ప్రశ్న నేడు తలెత్తుందని, తమ పిల్లలను స్కూల్ కి పంపాలంటే, భయపడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా నడుపుతున్న ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు… అదే సమయంలో సమాజంలో జరుగుతున్న ఇలాంటి నేరాల ప్రవృత్తికి కారణమైన అశ్లీల సినిమా, సాహిత్యాలు, మద్యం, మాదక ద్రవ్యాలు, పోర్నోగ్రఫీ నిషేధించాలని డిమాండ్ చేస్తూ, వీటి స్థానంలో విలువలను పెంపుదించే విద్యా విధానం అందించాలని, అల్లూరి, భగత్ సింగ్ నేతాజీ లాంటి గొప్ప వ్యక్తుల చరిత్రలను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో AIDSO నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జహీర్ మల్లేష్, AIMSS నగర అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి, ప్రియాంక నాయకులు విశ్వనాథ్ రెడ్డి, రామస్వామి, ఖాదర్, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.