జాంబియా మహిళకు అత్యంత అరుదైన పెద్ద పారా గాంగ్లియోమా
1 min read– 10 లక్షల మందిలో ఇద్దరికి మాత్రమే ఇలాంటి సమస్య
– కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ప్రపంచంలో ప్రతి పది లక్షల మందిలో ఇద్దరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన పారాగాంగ్లియోమా అనే కణితి సోకి, జాంబియా నుంచి వచ్చిన ఓ మధ్యవయసు మహిళకు కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఎండోక్రైన్ శస్త్రచికిత్స నిపుణురాలు డాక్టర్ రమ్య వలివేరు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తెలిపారు. ‘‘బాధితురాలు రక్తపోటు నియంత్రణ లేకుండా పెరుగుతూ, తగ్గుతూ ఉండటం, ఎంతకీ తగ్గని తల తిప్పడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆమెను జాంబియా ప్రభుత్వం కొండపూర్ కిమ్స్ ఆస్పత్రికి పంపింది. ఆమెకు తరచు తీవ్రంగా తలనొప్పి, ఆందోళన, గుండెదడ లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అవి గత ఐదు సంవత్సరాలుగా తగ్గకపోగా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆమెకు జాంబియాలో రోగనిర్ధారణ కోసం వివిధ పరీక్షలు చేయగా, ఉదరభాగంలో 8.5 * 7.5 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు తేలింది. ఇది చాలా అరుదైనది, దాన్నుంచి నార్-ఎడ్రినలిన్ అనే హార్మోన్ పెద్దమొత్తంలో విడుదల అవుతోంది. కణితి ఉన్న ప్రాంతం కూడా చాలా ఇబ్బందికరమైనది. ఇన్ఫీరియర్ వెనా కావా, అయోటా లాంటి అత్యంత కీలకమైన బృహద్ధమనుల వెనక అది ఉంది. దానికితోడు.. రెండు మూత్ర పిండాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కణితి ముందువైపు నుంచి వెళ్తున్నాయి. కుడి మూత్ర పిండానికి వెళ్లే రక్తనాళం కణితి వెనక నుంచి ఉంది. ఇవన్నీ కూడా కణితికి చాలా దగ్గరగా ఉన్నాయి. బాధితురాలు మా వద్దకు వచ్చినప్పుడు రక్తపోటు నియంత్రణలో లేదని గుర్తించాం. ముందుగా శస్త్రచికిత్స చేయడానికి ఆమెకు నిశితంగా పరీక్షలు చేసి, తర్వాత సిద్ధం చేశాం. ఇలాంటి శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ముందుగా సిద్ధం చేయడం చాలా కీలకం. ఎండోక్రైనాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి నేతృత్వంలో తర్వాత ముందుగా ఆల్ఫా, బీటా బ్లాకేడ్ చేయడం ద్వారా ఆమె ఎండోక్రైన్‌ను నియంత్రించడంతో పాటు రక్తపోటును కూడా నియంత్రించారు. శస్త్రచికిత్స చేసిన తరువాత పరీక్ష ద్వరా హార్మోన్లు నార్మల్ లెవల్స్ కి వచ్చాయరి నిర్థారించారు. రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాలను నియంత్రించడం కూడా ఈ కేసులో అతిపెద్ద సవాలు. పారాగాంగ్లియోమాస్ సమస్యకు శస్త్రచికిత్స చేయడం ఇతర కణితుల తొలగింపు కంటే చాలా భిన్నమైనది. ఈ కణితికి ఏమాత్రం చిన్న గాయం తగిలినా, హార్మోన్లను పెద్దమొత్తంలో విడుదల చేస్తుంది, అప్పుడు గుండెమీద భారం పడుతుంది. అత్యంత జాగ్రత్తగా, పూర్తిగా లెక్కలు చూసుకుని మూత్రపిండాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కణితిని తొలగించగలిగాం. డాక్టర్ వీరభద్రరావు నేతృత్వంలోని అనుభవజ్ఞులైన మత్తువైద్య నిపుణులు శస్త్రచికిత్స సమయంలోను, తర్వాత బాధితురాలిని అత్యంత సురక్షితంగా చూసుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత ఆమెకు ఎలాంటి సమస్యలు రాకపోవడం, ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆమెను డిశ్చార్జి చేశాం. తొలగించిన కణితిని పరీక్షించగా, అది పారాగాంగ్లియోమానే అని నిర్ధారణ అయ్యింది. తదుపరి ఆమె ఎప్పటికప్పుడు తగిన వైద్యపరీక్షలు, జన్యుపరీక్షలు చేయించుకోవాలని సూచించాం’’ అని డాక్టర్ రమ్య వలివేరు తెలిపారు.