నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన బుక్కరాయసముద్రం వాసి
1 min readపల్లెవెలుగు వెబ్ అనంతపురం : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బ్రెయిన్ డెత్ స్థితికి చేరుకున్న ఓ మేస్త్రి కుటుంబం చూపిన పెద్ద మనసు నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రానికి చెందిన ఎ.జగదీష్ (30) తాపీమేస్త్రి పని చేస్తుంటారు. ఒక పనికి వెళ్లి తిరిగి వస్తుండగా బైకు నుంచి పడిపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, అక్కడ సీటీస్కాన్ చేయగా సమస్య తీవ్రమని తెలిసింది. దాంతో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి అతడిని తరలించారు. ఇక్కడ వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేసినా, జగదీష్ కోలుకోలేకపోయాడు. పలు పరీక్షల అనంతరం కిమ్స్ సవీరా వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ విషయాన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు పరిస్థితి వివరించి, కౌన్సెలింగ్ చేయగా అవయవదానం చేసేందుకు అంగీకరించారు. జీవన్‌దాన్ బృందానికి విషయం తెలియజేయడంతో అతడి ఊపిరితిత్తులు, కాలేయం, రెండు మూత్రపిండాలను దానం చేయడానికి వీలు కుదిరింది. ఒక మూత్రపిండాన్ని కిమ్స్ సవీరా ఆస్పత్రిలోనే ఆరోగ్యశ్రీ కింద ఒకరికి అమర్చగా, ఊపిరితిత్తులను హైదరాబాద్, కాలేయాన్ని విశాఖపట్నానికి, ఒక మూత్రపిండాన్ని కర్నూలుకు తరలించారు. జీవన్‌దాన్ వారు సకాలంలో స్పందించడంతో జగదీష్ అవయవాలను ఆపన్నులకు గ్రీన్ ఛానల్ ద్వారా సకాలంలో అందించడం సాధ్యమైంది. జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వాస్పత్రిలోని ఫోరెన్సిక్ విభాగం సమన్వయంతో ఈ మొత్తం కార్యక్రమం సజావుగా సాగింది. కిమ్స్ సవీరా ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు అవయవ సేకరణలో పాల్గొన్నాయి. మృతుడు జగదీష్‌కు రెండు సంవత్సరాల వయసున్న పాప, రెండు నెలల వయసున్న మరో పాప ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు.