NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడేళ్ల బాలిక‌కు తిర‌గ‌బ‌డిన మూత్రపిండం

1 min read

దానికితోడు మూత్రనాళాల్లో అడ్డంకి

సూక్ష్మ శ‌స్త్రచికిత్సతో ప్రాణాలు పోసిన కిమ్స్ ఐకాన్ వైద్యులు

విశాఖ‌ప‌ట్నం , న్యూస్​ నేడు : కేవ‌లం మూడు సంవ‌త్సరాల వ‌య‌సున్న బాలిక‌కు అరుదైన స‌మస్య వ‌చ్చింది. ఆమెకు పుట్టుకతోనే మూత్రపిండం ఒక‌టి తిర‌గ‌బ‌డి ఉంది. దానికితోడు మూత్రనాళాల్లో అడ్డంకి కూడా ఉంది. ఈ స‌మ‌స్యతో ఆమె త‌ర‌చు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురికావ‌డం, విప‌రీత‌మైన నొప్పి, బరువు తగ్గడం లాంటి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతోంది. ఈ బాలిక‌కు విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో యూరాల‌జీ నిపుణుడు డాక్టర్ అభిరామ్ కుచ్చర్లపాటి అత్యంత క్లిష్టమైన శ‌స్త్రచికిత్సను సూక్ష్మ ప‌ద్ధతిలో చేసి ప్రాణాలు నిల‌బెట్టారు. ఈ కేసు వివ‌రాల‌ను ఆయ‌న మీడియాకు తెలిపారు. “త‌ర‌చు నొప్పి రావ‌డం, ఇన్ఫెక్షన్లకు గుర‌వ్వడం, బ‌రువు త‌గ్గిపోతుండ‌డంతో ఆందోళ‌న చెందిన త‌ల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆమెకు త‌గిన ప‌రీక్షలు చేయ‌గా, పెల్వియూరేట‌రిక్ జంక్షన్ అబ్‌స్ట్రక్షన్ (పీయూజే అబ్‌స్ట్రక్షన్‌) అనే స‌మ‌స్య ఉంద‌ని తేలింది. ఇది కిడ్నీ నుంచి మూత్రకోశానికి వెళ్లే దారిలో ఉండే అడ్డంకి. దానికితోడు.. పాప‌కు కిడ్నీ సాధార‌ణ స్థితిలో కాకుండా, తిరగ‌బ‌డి ఉంది. దాంతో శ‌స్త్రచికిత్స చాలా స‌మ‌స్యాత్మకంగా మారింది. మామూలుగా అయితే ఇలాంటి స‌మ‌స్యల‌కు ఓపెన్ శ‌స్త్రచికిత్స చేస్తారు. కానీ, పాప వ‌య‌సు దృష్ట్యా అత్యంత నైపుణ్యంతో మినిమ‌ల్లీ ఇన్వేజివ్ శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణయించాం. లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీ అనే సూక్ష్మ శస్త్రచికిత్సను ఎంచుకున్నాం. కేవలం చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేసిన ఈ శస్త్రచికిత్స వల్ల మ‌చ్చలు ప‌డ‌క‌పోవ‌డం, తక్కువ నొప్పి, త్వర‌గా కోలుకునే అవకాశం లభించింది. ముఖ్యంగా, తిర‌గ‌బ‌డి ఉన్న కిడ్నీ చుట్టూ ఉన్న సున్నిత‌మైన అవ‌య‌వాల‌కు ఏమాత్రం దెబ్బ త‌గ‌ల‌కుండా శస్త్రచికిత్స చేయ‌గ‌లిగాం. దీంతో బాలిక చాలా త్వర‌గానే కోలుకుంది. కొద్దిరోజుల్లోనే ఇంటికి తిరిగి వెళ్లింది. త‌ర్వాత తాజాగా చేసిన ప‌రీక్షల్లో కూడా కిడ్నీ బాగా ప‌నిచేస్తోంద‌ని, మూత్రవిస‌ర్జన కూడా సాధార‌ణంగానే అవుతోంద‌ని తేలింది. ఇప్పుడు ఎలాంటి నొప్పి, ఇబ్బంది లేకుండా పాప సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది” అని డాక్టర్ అభిరామ్ తెలిపారు.బాలిక తల్లిదండ్రులు “మా కుమార్తెకు కొత్త జీవితం ఇచ్చిన డాక్టర్ అభిరామ్, వైద్య బృందానికి, ఆస్పత్రి సిబ్బంది, యాజ‌మాన్యానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ భావోద్వేగంగా తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *