ఉత్తుత్తి నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు వల !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ఆరోగ్యశాఖలో కొలువుల పేరిట కేటుగాళ్లు భారీ స్కెచ్ వేశారు. ఉద్యోగాలు కచ్చితంగా వచ్చేస్తాయని కమిషనరేట్‌లోని కొంతమంది సిబ్బంది, ఓ కన్సల్టెన్సీ సంస్థ కలసి నిరుద్యోగులను నమ్మించారు. ఆరోగ్యశాఖ స్టాంపులతో ఫేక్ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు ఏకంగా కమిషనరేట్ కార్యాలయంలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఈ ఓవర్ యాక్షన్‌కు బుట్టలో పడిపోయిన నిరుద్యోగులు… వారిని పూర్తిగా నమ్మి కన్సల్టెన్సీ ద్వారా రూ.లక్షలు సమర్పించుకున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో సిబ్బంది విందులు, విలాసాల్లో మునిగి తేలారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు బాధితులు అడ్డం తిరిగారు. నేరుగా వెళ్లి కన్సల్టెన్సీ సంస్థను నిలదీశారు. దీనిపై సదరు సంస్థ యాజమాన్యం కమిషనరేట్ సిబ్బందిని గట్టిగా ప్రశ్నించడంతో వ్యవహారంమొత్తం బయటపడింది. ఇప్పటికే పెద్దసంఖ్యలో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోవడం, డబ్బులిచ్చిన వారినుంచి ఒత్తిడి పెరగడంతో కన్సల్టెన్సీ సంస్థ యాజమాన్యం, బాధితులతో కలసి నేరుగా డీజీపీకి, ఆరోగ్యశాఖ మం త్రికి ఫిర్యాదు చేసింది.