ఓటు ప్రజలకు పాశుపతాస్త్రం లాంటిది
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కు ఒక పాశు పతాస్త్రం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా తమ గొంతుకను వినిపించాలని కర్నూలు కలెక్టర్ సృజన సూచించారు. మంగళవారం ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ, పత్తికొండలో స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద కలెక్టర్ సృజన జండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అవగాహన ర్యాలీ నాలుగు స్తంభాల కూడలి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకుని సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అందరి బాధ్యతగా గుర్తు చేశారు. భయాలకు ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యహితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండి తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 25 వరకు ఓటుకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని యువతకు తెలిపారు. అనంతరం స్థానిక గోపాల్ ప్లాజా లో ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆర్డిఓ రామలక్ష్మి, తాసిల్దార్ లో, ఎన్నికల అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.