మహిళకు మెదడులో పెద్ద బంగాళదుంపంత కణితి
1 min read14 గంటల పాటు శస్త్రచికిత్స చేసి తొలగించిన కర్నూలు కిమ్స్ వైద్యులు
అత్యాధునిక సదుపాయాలు, అత్యంత నిపుణులైన వైద్యుల వల్లే సాధ్యం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మెదడులో పెద్ద బంగాళదుంపత భారీ కణితి ఏర్పడటంతో మాట సరిగా రాకపోవడం, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న 48 ఏళ్ల మహిళకు కర్నూలు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ఊరట కల్పించారు. ఈశ్వరమ్మ అనే మహిళ మాట బాగా తడబడటంతో పాటు తీవ్రమైన తలనొప్పి వచ్చి ఇబ్బంది పడ్డారు. తొలుత వేరే ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి నుంచి కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమెను కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ సుమంత్ కుమార్ పరీక్షించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.“ఈశ్వరమ్మకు తగిన వైద్య పరీక్షలు చేసిన తర్వాత, ఆమెకు ఎడమవైపు టెంపొరల్ స్కల్ బేస్ ప్రాంతంలో అత్యంత భారీ కణితి ఏర్పడినట్లు గుర్తించాం. సాధారణంగా మెదడులో ఎడమవైపు టెంపొరల్ ప్రాంతం మాటకు, జ్ఞాపకశక్తికి సంబంధించి ఉంటుంది. సరిగ్గా ఈ ప్రాంతాన్ని ఆనుకునే భారీ కణితి ఏర్పడటంతో, అసలు ఏం చేయాలన్న విషయంలో రోగి బంధువులు తగిన నిర్ణయం తీసుకోలేకపోయారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా మాట, జ్ఞాపకశక్తి తిరిగి వస్తాయా, లేదా అన్న విషయం కచ్చితంగా చెప్పలేకపోవడంతో పాటు, మరింత ఇబ్బంది తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలు ఉండటంతో పాటు, నిపుణులైన వైద్య బృందం కూడా ఉండటంతో శస్త్రచికిత్స చేపట్టాలని నిర్ణయించాం. కణితి బాగా పెద్దగా ఉండటంతో, దాన్ని మొత్తం తొలగించడానికి 14 గంటల సమయం పట్టింది. కణితిని తొలగించడంతో పాటు అదే సమయంలో ఆమె జ్ఞాపకశక్తి, ఇతర సామర్థ్యాలు దెబ్బతినకుండా ఉండేందుకు అత్యంత జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆమె ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకున్నారు” అని వివరించారు.