పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయిన యువనేత
1 min readపల్లెవెలుగు వెబ్: లోక్ జన శక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత .. ఆయన పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయిలోకి చేరింది. ఆ పార్టీకి ఆరుగురు ఎంపీలు ఉండగా.. ఐదు మంది తిరుగుబాటు చేశారు. రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ నాయకత్వం పట్ల వ్యతిరేఖంగా ఉన్న ఐదుగురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ లోక్ సభ స్పీకర్ .. ఓం బిర్లాకు లేఖ రాశారు. ఒకే వ్యక్తి, ఒకే పదవి అన్న సిద్దాంతం కింద చిరాగ్ పాశ్వాన్ ను ఎల్ జేపీ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించినట్టు ఆ ఐదుగురు ఎంపీలు ప్రకటించారు. ‘ నా తండ్రి, నా కుటుంబం ఏర్పాటు చేసిన పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేశాను. కానీ విఫలమయ్యాను. పార్టీ తల్లి లాంటిది. ఎప్పుడూ ద్రోహం చేయకూడదు ’ అంటూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.