సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించండి
1 min read– రక్త హీనత నివారణా చర్యలు ముమ్మరంగా చేపట్టండి
– తక్కువ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి
– వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన చీఫ్ సెక్రటరీ డా.జవహర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో నిర్దేశించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులను సూచించారు.గురువారం విజయవాడలోని రాష్ట్ర సచివాలయం నుంచి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, స్కూల్ ఎడ్యుకేషన్, మహిళా మరియు శిశు సంక్షేమ ప్రభుత్వ పథకాలు, విలేజ్, వార్డు సెక్రటేరియట్, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై కలెక్టర్లు, జేసిలతో చీఫ్ సెక్రటరీ డా.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ముఖ్యమైన 8 అభివృద్ధి సూచికల్లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధనలో భాగంగా అనీమియా నివారణా చర్యలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఇందుకోసం గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికల్లో రక్తహీనత బాధితులను గుర్తించి వారిలో హిమోగ్లోబిన్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తక్కువ బరువు ఉన్న పిల్లలపై ఐసిడిఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మన బడి నాడు నేడు క్రింద చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జగనన్న గోరుముద్ద పథకాన్ని పటిష్టంగా అమలు పరచాలన్నారు. జగనన్న కాలనీలలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఐదేళ్ల లోపు వున్న చిన్నారులు, కిశోర బాలికలు, బాలింతలు, గర్భిణుల్లో రక్త హీనత, పోషకాహార లోపం వున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.