ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
1 min read– ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై అనేక రకాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఈ విధానాలను తక్షణమే మానుకోవాలని లేనిపక్షంలో సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి. శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం గడివేములలో జరిగిన ఏపీటీఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ హాజరు నమోదుకు గతంలో ఉపాధ్యాయులకు 9:10 నిమిషాలకు వరకు విద్యార్థులకు 10:30 వరకు అవకాశం ఉండేదని అయితే దసరా సెలవుల అనంతరం ఉపాధ్యాయులు 9 గంటల లోపల విద్యార్థులకు 9::30 లోపల ఆన్లైన్ హాజరు నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ , ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యాయులు సరైన సమయానికి పాఠశాలకు వచ్చినప్పటికీ హాజరు నమోదు కాకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పడం ఎంతవరకు సబబు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు ఆలస్యంగా జీతాలు ఇవ్వడం, దీర్ఘకాలంగా ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉంచడం, ఆందోళనకు పిలుపునిస్తే కేసులు పెట్టడం, నిర్బంధించడం, నోటీసులు ఇవ్వడం, ముందస్తు అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆన్లైన్ హాజరు గ్రేస్ పిరియడ్ ను తీసివేయడం వంటి విధానాలు ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆయన పేర్కొన్నారు. మరో ప్రక్క విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతి శనివారం పాఠశాలలను తనిఖీల పేరుతో విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను విద్యార్థుల ముందే దూషిస్తూ, వీడియోలు తీస్తూ, భయభ్రాంతులకు గురి చేయడము అనేది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. గత శనివారం అనంతపురంలో ఇద్దరు టీచర్లు సస్పెండ్ చేయడం, జిల్లా విద్యాశాఖ అధికారులను దూషించడం, టీచర్లు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని మాట్లాడడం ఆయన హోదాకు తగదని ఆయన అన్నారు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా , బోధ నేతర పనులతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం, వారి సమస్యలను పరిష్కరించకుండా సమాజంలో ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేటట్లుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఉద్యమాల ద్వారా ఆందోళనలు చేస్తామని ఆయన ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్. మహబూబ్ బాషా, ఏ. నాగన్న, జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. బాలస్వామి, మానపాటి రవి, సీనియర్ నాయకులు నాగయ్య, కె. రాముడు, రాంపుల్లారెడ్డి, ఎం. ప్రతాపరెడ్డి, మల్లికార్జునయ్య, మారెన్న, శ్రీరాములు , చంద్రశేఖర ఆచారి, కవిత ,చంద్రావతి, ఆదిశేషమ్మ, పుష్పకుమారి, లక్ష్మీదేవి, లలిత తదితరులు పాల్గొన్నారు.