PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

1 min read

– జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కొళాయి కనెక్షన్లు ఇవ్వండి

– పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

పల్లెవెలుగు వెబ్  నంద్యాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేసి జాప్యం చేస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రాధాన్యత భవనాల ప్రగతి, జల జీవన్ మిషన్ అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు తదితర ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనుల్లో ఆలస్యం చేసి నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తప్పన్నారు. నిర్మాణాల పురోగతిపై ప్రతివారం చీఫ్ సెక్రటరీ సమీక్షిస్తున్న నేపథ్యంలో నిర్దేశిత లక్ష్య ప్రగతిపై పూర్తిస్థాయి దృష్టి సారించి నిర్మాణ పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా నిర్మాణ ప్రగతి శాతం తక్కువగా ఉన్న ఇంజనీర్లు వచ్చే సమావేశానికి ఆశించిన ప్రగతి కనపరచకపోతే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 239 గ్రామ సచివాలయాలు,155 రైతు భరోసా కేంద్రాలు, 70 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను సంబంధిత శాఖలకు స్వాధీనం చేశామని పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ రామ్మోహన్ కలెక్టర్ కు నివేదించారు.జలజీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికి కొళాయి పనులు  పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్జలజీవన్ మిషన్ పథకం కింద ఈ నెలాఖరుకు కేటాయించిన 5,254 ఇంటింటికి కులాయి నిర్మాణ పనులను పూర్తిచేయాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మొత్తం 21.53 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని కూడా అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంజూరు చేసిన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  సిపిడబ్ల్యూఎస్ స్కీముల పనితీరు మెరుగు పరచడంతో పాటు మరమ్మతులకు గురి అయిన అన్ని చేతి బోర్లను రిపేర్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి 15 రోజులకు అన్ని OHSRS ట్యాంకులను శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేయించాలన్నారు. ఎంపీ లాడ్స్, గడపగడపకు మన ప్రభుత్వం జిల్లా పరిషత్ నిధుల కింద మంజూరైన పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జల్ జీవన్ స్వచ్ఛ సర్వేక్షణ్ నివేదికలో జిల్లా ర్యాంక్‌ను మెరుగుపరచేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ మనోహర్, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యుఎస్ డిఈలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.

About Author